ఫోన్ చేస్తే.. బెల్టు తీస్తారు | Belt, even if it comes from .. | Sakshi
Sakshi News home page

ఫోన్ చేస్తే.. బెల్టు తీస్తారు

Jul 11 2014 4:24 AM | Updated on Nov 9 2018 5:52 PM

ఫోన్ చేస్తే.. బెల్టు తీస్తారు - Sakshi

ఫోన్ చేస్తే.. బెల్టు తీస్తారు

జిల్లాలో బెల్టు షాపుల నివారణకు ఎట్టకేలకు కమిటీలు ఏర్పాటు చేసి, వాటి విధి విధానాలను రూపొందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  •      బెల్టుషాపుల నివారణకు కాల్ సెంటర్
  •      జిల్లా వ్యాప్తంగా కమిటీల ఏర్పాటు
  • చిత్తూరు(అర్బన్): జిల్లాలో బెల్టు షాపుల నివారణకు ఎట్టకేలకు కమిటీలు ఏర్పాటు చేసి, వాటి విధి విధానాలను రూపొందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్సుమెంటు శాఖకు గురువారం ఉత్తర్వులు అందాయి. బెల్టు షాపుల నివారణకు ఫిర్యాదులు స్వీకరించి చర్యలు తీసుకోవడానికి కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
     
    కమిటీలు ఏర్పాటు...

    బెల్టు షాపుల నివారణ, మద్యం అధిక ధరలకు విక్రయిస్తే అరికట్టడానికి గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తొలుత గ్రామ స్థాయిలో స్థానిక సర్పంచ్ అధ్యక్షుడిగా, అక్కడే ఉన్న మహిళా సంఘాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా, వీఆర్‌వో కన్వీనర్‌గా జిల్లాలో మొత్తం 1564 గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు.

    ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రత్యేక సమావేశం నిర్వహించి బెల్టు షాపులపై వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై సమీక్షిస్తుంది. అలాగే మండల స్థాయిలో మండలాధ్యక్షుడు అధ్యక్షుడిగా కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, స్థానిక పోలీసు స్టేషన్ ఎస్‌ఐ, ఎంపీడీవో, తహసీల్దారు సభ్యులుగా ఉండి, ఎక్సైజ్ ఎస్‌ఐ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

    జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షుడుగా, ఎస్పీ, ఆర్డీవో, ఎక్సైజ్ సూపరింటెండెంట్, డీఎస్పీ, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, రాస్ సంస్థ సభ్యులు, జిల్లా సామాజిక సంస్థల కమిటీ అధ్యక్షులు, న్యాయవాది సురేంద్రబాబును సభ్యులుగా నియమించారు. కమిటీ కన్వీనర్‌గా ఎక్సైజ్ ప్రొహిబిషన్ సంస్థ డెప్యూటీ కమిషనర్ వ్యవహరిస్తారు. మండల, జిల్లా కమిటీలు తప్పనిసరిగా నెలకు ఒకసారి సమావేశమై బెల్టుషాపులపై ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు, నమోదు చేసిన కేసులపై చర్చిస్తారు.
     
    కాల్ సెంటర్ ఏర్పాటు...

    తొలిసారిగా జిల్లాలో బెల్టుషాపుల నివారణకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైనా బెల్టుషాపు ఉంటే ఫోన్ నెంబరు : 040-24612222కు ఫోన్ చేసి వివరాలు చెబితే అక్కడ ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తారు. ఈ ఫోన్ ప్రతిరోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.  ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తారు.  మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయించినా, బెల్టుషాపులకు మద్యం బాటిళ్లు సరఫరా చేసినా దుకాణాల లెసైన్సుల రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement