జయహో బీసీ

BC Jayaho Ysrcp Mp Tickets - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌లను ఆ పార్టీ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్‌ స్థానాల్లో 9 స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన రెండు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. జిల్లాలోని బీసీల్లో మెజార్టీ వర్గంగా ఉన్న బోయ సామాజికవర్గం నుంచి రంగయ్య, కురుబ సామాజిక వర్గం నుంచి మాధవ్‌కు టిక్కెట్లు కేటాయించారు. దీంతో బీసీల అభ్యన్నుతికి, రాజకీయ ఉన్నతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లయింది. ఈ నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా బీసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. పైగా ఇద్దరూ రాజకీయాలకు కొత్త ముఖాలే. విద్యావంతుడైన రంగయ్యను, పోలీసు శాఖలో డైనమిక్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న మాధవ్‌లను పార్టీలో చేర్చుకుని పార్లమెంట్‌ బరిలో నిలపడంతో సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్లడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని చెప్పినట్లయింది.

పోలీసు నుంచి ఎంపీ అభ్యర్థి దాకా..
గోరంట్ల మాధవ్‌ అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ, లా కోర్సు పూర్తి చేశారు. 1996 బ్యాచ్‌ ఎస్‌ఐగా పోలీసు శాఖలోకి ప్రవేశించారు. అనంతపురం నగరంలోని సిద్ధప్ప జ్యూవెలర్స్‌ అధినేత రేవన సిద్ధప్ప మనువరాలును వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. ఉద్యోగ నిమిత్తం పలు స్టేషన్లలో పనిచేసిన ఆయన 2003 నుంచి జిల్లాలోని పలు స్టేషన్లలో ఎస్‌ఐగా, ఆ తర్వాత సీఐగా విధులు నిర్వహించారు. ఉద్యోగ జీవితంలో నిజాయతీ అధికారిగా, లా అండ్‌ ఆర్డర్‌ అమలులో రాజీపడని పోలీసుగా మాధవ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలకభూమిక పోషించి వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేశారు.

గ్రూప్‌–1 అధికారి నుంచి...
తలారి రంగయ్య అనంతపురం జిల్లాకు పీడీ రంగయ్యగా సుపరిచితులు. 21 ఏళ్లు గ్రూప్‌–1 అధికారిగా పని చేశారు. ఇంకా 13 ఏళ్ల సర్వీస్‌ ఉంది. 2018 ఫిబ్రవరి 14న వీఆర్‌ఎస్‌ ఆమోదం పొందింది. 1997లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్‌–1 అధికారిగా ఎంపికై చేనేత జౌళిశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరారు. 1998–99 చిత్తూరు జిల్లాలో, తర్వాత 1999 నుంచి 2002 వరకు నెల్లూరు జిల్లాలో పని చేశారు. ఆ తర్వాత 2002 నుంచి 2006 వరకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలుగు ప్రాజెక్ట్‌లో.. 2006–07లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అడిషనల్‌ డైరెక్టర్‌గా అనంతపురంలో సేవలందించారు. 2007 నుంచి 2009 వరకు కడప మెప్మా డైరెక్టర్‌గా పని చేశారు. 2009లో వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌గా.. 2009 నుంచి 2012 వరకు అనంతపురం డీఆర్డీఏ పీడీగా ఉన్నారు. 2012–13లో హిందూపురం మునిసిపల్‌ కమిషనర్‌గా, 2013–14లో అనంతపురం మునిసిపల్‌ కమిషనర్‌గా పని చేశారు 

రాష్ట్ర భవిష్యత్తు వైఎస్‌ జగన్‌ 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు చాలా బాధిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రశ్నించలేకపోయా. రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో కమిట్‌మెంట్‌ రాజకీయాలు చేస్తున్న యువకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరా. అత్యంత సామాన్యులకు సైతం పెద్దపీట వేసి రాజకీయ భవిష్యత్తు కల్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మంతా రుణపడి ఉంటా. 
– తలారి రంగయ్య 

బీసీలకు ఇచ్చిన గౌరవం
పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాననే ప్రకటన ఉద్వేగానికి గురిచేస్తోంది. సామాన్య కుటుంబంలో జన్మించా. పోలీసు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా డిపార్ట్‌మెంట్‌లోకి రావాలనే పట్టుదలతో ఎస్‌ఐగా వచ్చా. ఆ తర్వాత నాయకుల పరిస్థితి, స్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలు చూసి రాజకీయాల్లోకి రావాలనే కాంక్ష ఉండేది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీరు, పట్టుదల చూసిన తర్వాత ఆయన నాయకత్వంలో పనిచేయాలనే కోరికతోనే వైఎస్సార్‌సీపీలో చేరా. ఇప్పుడు పురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటా. ఇది బీసీలకు మా పార్టీ ఇచ్చిన గౌరవం. అలాగే ‘అనంత’ పార్లమెంట్‌ అభ్యర్థి రంగయ్యకు అభినందనలు. కచ్చితంగా రెండు పార్లమెంట్‌ స్థానాలను గెలవబోతున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాబోతున్నారు. ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం చూడబోతున్నారు.
– గోరంట్ల మాధవ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top