మన్యంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను బాక్సైట్ గుబులు వెంటాడుతోంది.
చింతపల్లి : మన్యంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను బాక్సైట్ గుబులు వెంటాడుతోంది. ఈ ఖనిజం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీతో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో బాక్సైట్ అంశంపై వారు డోలాయమానంలో పడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేయాలా? వద్దా అనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను కొన్నేళ్ళుగా మావోయిస్టులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.
ఇందుకు నిరసనగా గతంలో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ కె.రవిశంకర్, ఉగ్రంగి సోమలింగంలను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. జర్రెల అటవీ ప్రాంతంలో బాక్సైట్ ప్రతినిధుల బృందానికి మట్టి నమూనాలు సేకరించారనే ఆరోపణలపై జీకేవీధి వైస్ ఎంపీపీ సాగిన సోమలింగాన్ని కూడా మట్టుబెట్టారు. అలాగే పలువురు ప్రజా ప్రతినిధుల ఇళ్లపై దాడులు చేసి వ్యతిరేక ఉద్యమాలు ఉధృతం చేయకపోతే తగిన మూల్యం చెల్లిస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో ఈ ప్రాంత ప్రజాప్రతిధులతంతా పార్టీలకు రాజీనామాలు చేసి ప్రజలతో కలిసి రోజూ ఏదో ఒక ఆందోళన చేపట్టేవారు. టీడీపీ నేతలు కూడా అప్పట్లో ఇతర పార్టీలతో కలిపి బాక్సైట్ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడం, బాక్సైట్ తవ్వకాలను చేపడతామని ప్రకటించడంతో ఇన్నాళ్లు స్థబ్దుగా ఉన్న మావోయిస్టులు మరోసారి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలు ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ మేరకు ఇప్పటికే పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులకు లేఖలు కూడా పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ప్రాంతంలో ఉన్న కొద్ది మంది టీడీపీ నాయకులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలో లేదా వ్యతిరేక ఉద్యమంలో ఇతర పార్టీలతో కలిసిపాల్గొనాలా అన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు.