తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా స్థానిక జిల్లాస్టేడియంలో, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించారు. ఉదయం నుంచే పట్టణంలో పండుగ వాతావరణం ఏర్పడింది.
పెత్తరమాస (పెద్దల పండుగ) అయినప్పటికీ మహిళలు, చిన్నారులు బతుకమ్మ పండుగకే అధిక ప్రాధాన్యతను ఇచ్చి రంగు, రంగుల పూలను సేకరించి బతుకమ్మలను అలంకరించారు. పట్ణణంలోని వివిధ మహిళా సంఘాలు, పాలమూరు యూనివర్సిటీ, ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థినులు పలురూపాల్లో సిద్ధం చేసిన బతుకమ్మలను, గౌరీ మాతను స్థానిక గడియారం చౌరస్తా నుంచి ఊరేగింపుగా జిల్లాస్టేడియానికి తీసుకొచ్చారు. బతుకమ్మ ఆటపాటలతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది.
మంత్రి డీకే అరుణ స్వయంగా ముందుండి నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ సతీమణి అన్నపూర్ణ, ఎమ్మెల్యే సతీమణి ప్రసన్న, మెప్మా పీడీ పద్మహర్ష, హార్టికల్చర్ ఏడీ సువర్ణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జ్యోతితో పాటు పలువురు మహిళా అధికారులు, వివిధ శ్రేణుల ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ ఆటాపాటా ప్రదర్శించారు. మైదానంలో ప్రదర్శించిన అన్ని బతుకమ్మల వద్ద మంత్రి సుమారు రెండు గంటల పాటు బతుకమ్మ వేశారు. కలెక్టర్ గిరిజాశంకర్, ఏజీసీ డాక్టర్ రాజారాం, వివిధ శాఖల అధిపతులు వేడుకల్లో పాల్గొన్నారు. బాలభవన్‌కు చెందిన చిన్నారి కళాకారిణులు ప్రదర్శించిన నృత్యాలు, టీటీడీ మహిళా సంఘం, భజన బృందాలు చేసిన భజనలు ఆకట్టుకున్నాయి. జిల్లాకు చెందిన విద్యావేత్త డాక్టర్ విజితారెడ్డి బతుకమ్మ ప్రాశ స్త్యాన్ని వివరించారు.
రాష్ట్ర పండుగగా బతుకమ్మ: మంత్రి డీకే
నాలుగేళ్లుగా బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం అధికారి కంగా నిర్వహిస్తోందని మంత్రి డీకే అరుణ పేర్కొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముందు రోజు చేపట్టిన ఈ పండుగ జిల్లా, రాష్ట్ర ప్రజలకు శుభాలు కలుజేయాలని అకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించినందుకు ఈ పండుగకు ప్రత్యేక విశిష్టత ఉందని అన్నారు. గౌరీమాత అందరినీ చల్లగా చూడాలని, రాబోయే కాలంలో ఈ వేడుకలను మరింత ఉత్సాహంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.