బాబు బస్సుయాత్ర


సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడడానికి మూలకారకులైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై సీమాంధ్రులు మండిపడుతున్నారు. మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అటు అధిష్టానానికి చెప్పుకోలేక, ఇటు ప్రజానీకాన్ని సమాధానపరచలేక సతమతమవుతున్నారు. అందుకే చాలామంది నేతలు ప్రజల మధ్యకు వెళ్లడానికి జంకుతున్నారు.



ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా రాష్ట్రాన్ని రెండుగా చీల్చేందుకు కేంద్రానికి అంగీకార లేఖ ఇవ్వగా, మరోవైపు ఆ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారు. అసలు చంద్రబాబు మదిలోని ఆలోచన ఏమిటో అర్థంకాక ఆ పార్టీలోని వారే ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గుంటూరు, కృష్ణాజిల్లాల్లో బస్సు యాత్రకు సిద్ధమవుతుండగా, ఆయన ఏ మొహం పెట్టుకుని జనం మధ్యకు వస్తారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ధైర్యం చేసి వచ్చినా ఛీత్కారాలు తప్పవేమోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

 

బావమరిదికన్నా ముందుండాలనే..




 వాస్తవానికి ఈ నెల 25న విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి చంద్రబాబు బస్సు యాత్ర ప్రారంభం కావాల్సిఉంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని అక్కడి నాయకులు చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇంతలో సెప్టెంబర్ రెండో తేదీన నిమ్మకూరు నుంచి ఎన్టీఆర్ తనయుడు, బావమరిది నందమూరి హరికృష్ణ చైతన్యరథయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. కేవలం ఆయనపై ఆధిపత్యం సాధించేం దుకే చంద్రబాబు ఒకరోజు ముందుగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు జిల్లాలో వారంరోజులపాటు బస్సుయాత్ర నిర్వహించిన తరువాత కృష్ణాజిల్లాలోకి ప్రవేశించేలా రాష్ట్ర పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది.

 

నిన్న లగడపాటి.. రేపు చంద్రబాబు



 తన మాటల జిమ్మిక్కులతో ప్రజలను మభ్యపెట్టగలనని భావించిన ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు బుధవారం విజయవాడలో ఆర్టీసీ కార్మికుల నుంచి చుక్కెదురైంది. దీక్ష చేస్తున్న కార్మికుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఆయన్ను ‘లగడపాటి గో బ్యాక్’అంటూ కార్మికులు నినాదాలు చేసి తరిమి తరిమికొట్టారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆమోదింపచేసుకుని వచ్చి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలంటూ అల్టిమేటం జారీ చేశారు. ఊహించని ఈ పరిణామంతో లగడపాటి కంగుతిన్నారు. రేపు చంద్రబాబుకైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేయకుండా, విభజనపై కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టనివ్వబోమని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు.  వస్తే ప్రజల నుంచి ఛీత్కారాలు, చీదరింపులు, అవమానాలు, నిరసనలే ఎదురవుతాయని స్పష్టం చేస్తున్నారు.

 

చంద్రబాబు ధీమా ఏమిటి!



 సమైక్యాంధ్రకు మద్దతుపై నోరు విప్పకుండా, ఏపీఎన్జీవోల నేతలు వెళ్లి కోరినప్పటికీ  లేఖను వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడని చంద్రబాబు ఏ ధైర్యంతో బస్సుయాత్రను ప్రారంభిస్తున్నారనే విషయంపై పార్టీలో రసవత్తర చర్చ జరుగుతోంది. గతంలో ఆయన కోస్తా జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఇంత ముమ్మురంగా లేదు.  అప్పుడాయన రాష్ట్ర విభజన ఊసెత్తకుండా  తూతూమంత్రంగా ముగిం చా రు. అప్పట్లో లగడపాటి  చంద్రబాబును అడ్డుకుంటున్నట్లు హైడ్రామా సృష్టిం చారు. పోలీసులు లగడపాటిని అడ్డుకుని చంద్రబాబు పాదయాత్ర సజావుగా సాగేందుకు సహకరించారు. ఈసారి   సమైక్యవాదుల నుంచి వచ్చే ప్రతిఘటన ను పోలీసులు ఎంతమేరకు అడ్డుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top