బైక్‌.. త‘లుక్‌’

Awareness on Bike Maintenance - Sakshi

గీతలు తొలగించే స్క్రాచ్‌ రిమూవర్లు

రంగు వెలిసిపోకుండా స్ప్రే పాలిష్‌లు

జాగ్రత్తలు పాటిస్తే పెరగనున్న జీవితకాలం

చిన్న చిట్కాలతో రూపురేఖలు పదిలం

ఇష్టంగా కొనుక్కున్న బైక్‌ మీద చిన్న గీత పడినా ఎంతో బాధపడతాం. కొన్నిసార్లు బయటి వాతావరణం వల్ల బైక్‌ రంగు తొందరగా వెలిసిపోతుంది. అలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఇప్పుడు స్ప్రే పాలిష్‌లు, స్క్రాచ్‌ రిమూవర్లు అందుబాటులో ఉన్నాయి. బైక్‌పై గీతలు పడిన చోట స్క్రాచ్‌ రిమూవర్‌ను ఉపయోగిస్తే అవి కనిపించవిక. స్ప్రే పాలిష్‌తో బైకుకు కొత్త మెరుపును అందించవచ్చు. వీటిని వినియోగించే ముందు బైకును, వాటిని ఉపయోగించే భాగాలను షాంపూతో రుద్ది, దుమ్ము, మరకలు వంటివి లేకుండా కడిగేయాలి. ఆ తర్వాత తుడిచి, కాసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత.. దుమ్ము పడితే కాటన్‌తో తుడిచి స్క్రాచ్‌ రిమూవర్‌ను లేదా స్ప్రే పాలిష్‌ను ఉపయోగించాలి. ఆయా ఉత్పత్తులపై పేర్కొన్న సూచనలు పాటిస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. స్ప్రే పాలిష్‌/స్క్రాచ్‌ రిమూవర్ల నాణ్యత, పరిమాణం బట్టి ధర ఉంటుంది.

విజయనగరం మున్సిపాలిటీ: ఇటీవల కాలంలో బైక్‌ భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. రెప్పపాటులో బైక్‌లను మాయం చేసే మాయగాళ్ళు పెరిగారు. బైక్‌ను ఎవరూ ఎత్తుకుపోకుండా, కదిలించకుండా ఉండేందుకు తోడ్పడేలా డిస్క్‌ బ్రేక్‌ లాక్, ఫ్రంట్‌ వీల్‌ లాక్‌లు అందుబాటులో ఉన్నాయి. చిన్నగా ఉన్నా అత్యుత్తమ రక్షణ అందించడం వీటి ప్రత్యేకత. డిస్క్‌ బ్రేక్‌ సదుపాయం ఉన్న బైకులకు డిస్క్‌ బ్రేక్‌ లాక్, లేని వాటికి ఫ్రంట్‌ వీల్‌ లాక్‌ తోడ్పడుతుంది. డిస్క్‌ బ్రేక్‌ లాక్‌ చాలా చిన్నగా ఉంటుంది. అవసరమైతే జేబులో వేసుకుని వెళ్లొచ్చు. డిస్క్‌ బ్రేక్‌ ప్లేట్‌ పై ఉండే రంధ్రం గుండా చిన్నపాటి ఐర¯న్‌ లాక్‌ను చొప్పించి తాళం వేయవచ్చు. తాళం చెవి లేకుండా దీన్ని తీయడం చాలా కష్టం. వీటి ధరలు రూ.150 నుంచి రూ.250 వరకు మాత్రమే ఉంటాయి. ఫ్రంట్‌ వీల్‌ లాక్‌ ముందు ఉండే చక్రానికి మధ్యలో అమర్చవచ్చు. చక్రం ఫోక్‌ లేదా అల్లారు వీల్‌ రాడ్‌ను రెండు వైపులా అడ్డుకునేలా దీనిలో ఏర్పాటు ఉంటుంది. ఈ లాక్‌ వేస్తే బైకును ముందుకు.. వెనక్కి ఏ మాత్రం కదిలించలేరు.

జాగ్రత్తలు పాటించాలి
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనంపై ఆధారపడుతున్నారు. దీంతో వాటి సంఖ్య చాలా పెరిగింది. ప్రతి ఒక్కరు వాహనాన్ని కొనుగోలు చేసి నడపటం తప్ప నిర్వహణను పట్టించుకోరు. దీంతో కొత్త వాహనాలైనా త్వరగా పాడైపోతుంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పాత వాహనాన్నయినా కొత్తగా తయారు చేసుకోవచ్చు.–పి.శ్రీనివాసరావు,బైక్‌ మెకానిక్, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top