పచ్చని చెట్లపై పాషాణం
ఎన్నికల కక్షలు, కార్పణ్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి పచ్చని చెట్లను నాశనం చేసేందుకు కూడా వెనకాడటం లేదు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికల కక్షలు, కార్పణ్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి పచ్చని చెట్లను నాశనం చేసేందుకు కూడా వెనకాడటం లేదు. శుక్రవారం రాత్రి యల్లనూరు మండలం వెన్నపూసపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేశ్వరరెడ్డి చీనీ చెట్ల పాదుల్లో ప్రత్యర్థులు కిరోసిన్ పోశారు. దాదాపు 800 కాపు కాసే చీనీ చెట్లు నిట్టనిలువునా ఎండిపోయేలా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి చీనీ తోటను పరిశీలించారు. కిరోసిన్‌తో తడిచిన మట్టిని వెంటనే తొలగించి వేస్తే చెట్లు ఊపిరిపోసుకునే అవకాశమున్నా... గ్రామంలో నెలకొన్న భయానక వాతావరణం నేపథ్యంలో ఆ పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
వెన్నపూసపల్లెలో ఆధిపత్యమంతా జేసీ దివాకరరెడ్డి వర్గీయులదే. అక్కడ వారే అన్ని విషయాలనూ శాసించే స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజేశ్వరరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్లుగా నిలబడ్డారు. గ్రామం మొత్తం జేసీ వర్గీయుల ఆధిపత్యమే ఉన్నప్పటికీ, వెన్నపూసపల్లి బూత్‌లో వైఎస్‌ఆర్‌సీపీకి దాదాపు 40 ఓట్ల మెజారిటీ వచ్చింది.
రాజేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండటం వల్లే వైఎస్‌ఆర్‌సీపీకి ఆధిక్యత వచ్చిందన్న ఉద్దేశంతో వారిని ఎలాగైనా గ్రామంలో లేకుండా చేయాలని జేసీ వర్గీయులు దాడులకు ఉపక్రమించారు. ఫిబ్రవరి 22న రాజేశ్వరరెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన కాలు, చెయ్యి విరిగి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రతాప్‌రెడ్డి, పార్థసారధి.. తదితర జేసీ వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల పాటు రిమాండులో ఉన్న వారు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున (ఏప్రిల్16) గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుడైన అనిల్‌కుమార్ అనే దళితునిపై దాడి జరిగింది. నాలుగు రోజుల వ్యవధిలోనే జనార్దన రెడ్డి, బాబువల్లీలపైనా దాడి చేశారు.
వీటిపై కనీసం ఫిర్యాదు చేసేందుకు కూడా బాధితులు సిద్ధపడలేదు. పై పెచ్చు గ్రామం వదలి వెళ్లిపోయారు. దీన్నిబట్టే గ్రామంలో ఎంత భయానక వాతావరణం నెలకొందో అర్థం చేసుకోవచ్చు. కాగా, రాజేశ్వరరెడ్డి తల్లి సావిత్రి గ్రామంలోనే ఉంటూ చీనీ చెట్లను సంరక్షిస్తోంది. ఆయన్ను అన్ని రకాలుగా దెబ్బతీయాలనుకున్న ప్రత్యర్థులు శుక్రవారం రాత్రి ట్రాక్టరులో కిరోసిన్ క్యాన్‌లు తీసుకుని వెళ్లి చీనీ చెట్ల పాదుల్లో పోసినట్లు సావిత్రి యల్లనూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కక్షలకు పచ్చని చెట్లను కూడా బలి తీసుకుంటున్న ఈ విషసంస్కృతికి టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డకట్ట వేస్తారో లేక వంతపాడుతారో చూడాల్సి ఉందని పరిసర గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.


