ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీ మరో అడుగు!

APSRTC Another Step Towards Privatisation - Sakshi

ఉద్యోగుల్ని స్వచ్ఛంద పదవీ విరమణ చేయించేందుకు నిర్ణయం

వీఆర్‌ఎస్‌ అమలుపై ముసాయిదా రూపొందించిన యాజమాన్యం

52 ఏళ్లు దాటి, కనీసం 20 ఏళ్లు రెగ్యులర్‌ సర్వీసు పూర్తి చేస్తే వర్తింపు

నిర్బంధంగా వీఆర్‌ఎస్‌ వర్తించే ఉద్దేశం.. 30 వేల మంది ఉద్యోగులపై ప్రభావం

ఇప్పటికే ఆర్టీసీ స్థలాలు, కీలక విభాగాలు ప్రైవేట్‌కు అప్పగింత

వీఆర్‌ఎస్‌ ఆఫర్‌పై మండిపడుతున్న కార్మిక సంఘాలు..

సాక్షి, అమరావతి: ప్రజా రవాణాలో మేటిగా పేరుపొందిన ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. చంద్రబాబు సర్కార్‌ త్వరలోనే ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సంస్థలో గడిచిన నాలుగున్నరేళ్లుగా ఉద్యోగ ఖాళీల భర్తీ ఊసేఎత్తని సర్కార్‌.. తాజాగా ఉన్న ఉద్యోగులకు ఎసరు పెట్టే నిర్ణయాన్ని తీసుకుంది. సంస్థలోని ఉద్యోగులకు 52 ఏళ్లు దాటి, కనీసం 20 ఏళ్లు రెగ్యులర్‌ సర్వీసు పూర్తి చేసుకున్న వారికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీం–వీఆర్‌ఎస్‌) అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం ముసాయిదా రూపొందించింది. వీఆర్‌ఎస్‌ అడుగు ముందుకుపడితే ఆర్టీసీలో సుమారు 30 వేల మందిపై ప్రభావం ఉంటుందని అంచనావేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది డ్రైవర్లు, కండక్టర్లే ఉన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ వీఆర్‌ఎస్‌ ఆఫర్‌ ఇవ్వడంతో యాజమాన్యానికి కొత్త ఉద్యోగాలిచ్చే ఆలోచన లేదని, ఇది ప్రైవేటీకరణ కుట్రలో భాగమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ స్థలాల్ని ప్రైవేటు పరం చేయడం, అద్దె బస్సులను తిప్పడం, కీలక విభాగాలన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగింత వంటివి చేస్తున్నారు. ఇప్పుడు వీఆర్‌ఎస్‌ తీసుకొచ్చి నిర్భందంగా అమలు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సంస్థ ప్రస్తుతం రూ.4 వేల కోట్ల నష్టాల్లో ఉందని, ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్లే వీఆర్‌ఎస్‌ అమలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

ఆందోళనలో 30 వేల కుటుంబాలు
ఏపీఎస్‌ ఆర్టీసీలో 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 40 వేల మంది వరకు డ్రైవర్లు, కండక్టర్లే. టీడీపీ అధికారంలోకి వచ్చాక కండక్టర్ల పోస్టుల్ని కుదించడం ప్రారంభించింది. టిమ్‌ యంత్రాల ద్వారా డ్రైవర్ల చేతికే కండక్టర్ల బాధ్యతలు అప్పగిస్తూ నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఆఫర్‌ ఇచ్చాక దానికి కార్మికులు ఎవ్వరూ ముందుకు రాకపోతే సర్కారు ఆదేశాలకు అనుగుణంగా నిర్బంధంగా వీఆర్‌ఎస్‌ అమలు చేస్తారని సమాచారం. వీఆర్‌ఎస్‌ నిర్ణయంతో సంస్థలో పనిచేసే 30 వేల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో మాదిరిగా ఆర్టీసీలో 60 ఏళ్ల వయో పరిమితి అమలు చేయలేదు. 58 ఏళ్లకే పదవీ విరమణ అమలు చేస్తారు. 52 ఏళ్లకే  వీఆర్‌ఎస్‌ వర్తింపజేస్తే ఉద్యోగి వేతన సవరణ, ఇంక్రిమెంట్లు వంటి ప్రయోజనాలన్నీ కోల్పోతారు.

‘కారుణ్యం’లేని సర్కార్‌
ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీలో 1978 నుంచి కారుణ్య నియామకాలు ప్రవేశపెట్టారు. గతంలో చంద్రబాబు హయాంలోనూ, ప్రస్తుత పాలనలోనూ కారుణ్య నియామకాలను నిలిపేశారు. రాష్ట్రంలో మొత్తం 1,200 మంది కుటుంబాలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాయి. నిబంధనల పేరుతో మహిళా అభ్యర్థులకు కారుణ్య నియామకాల్లోనూ ఇబ్బందులు పెడుతున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్, సెక్యూరిటీ గార్డుల పోస్టులను ఇవ్వాలని నిబంధన ఉంది. క్లరికల్‌ పోస్టులకు అనుమతి లేదు. తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాల్లో మహిళలకు ఉద్యోగాలు ఇస్తున్నారని, ఏపీఎస్‌ఆర్టీసీ మాత్రం కారుణ్యం చూపడంలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఉద్యోగి కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇస్తామని 2015లో యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేసింది. మొత్తం 200 మంది మెడికల్‌ అన్‌ఫిట్‌ ఉద్యోగుల కుటుంబాల వారసులు దరఖాస్తు చేసుకున్నా.. వారిని తిప్పుకుంటున్నారే తప్ప ఉద్యోగాల ఊసెత్తడం లేదు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం వద్దనుకునే వారికి ఆర్టీసీ రూ.5 లక్షలు అందిస్తామని ఇటీవలే ప్రకటించింది. ఆర్టీసీలో 2014కు ముందు అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 140 పోస్టులు బ్యాక్‌లాగ్‌ పోస్టులున్నాయి. వీటి నాన్చివేత వైఖరి అవలంబిస్తున్నారు. ఖాళీలులేవని యాజమాన్యం చెబుతుంటే.. ట్రాఫిక్, నిర్వహణ విభాగంలో పలు ఖాళీలున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

అధికారికంగా ప్రతిపాదనలిస్తే స్పందిస్తాం
వీఆర్‌ఎస్‌పై యాజమాన్యం కేవలం డ్రాఫ్ట్‌ మాత్రమే రూపొందించింది. యూనియన్లకు మెసేజ్‌లు పంపించారు. రెండ్రోజుల్లో అభిప్రాయాలు చెప్పాలని యాజమాన్యం కోరింది. అయితే అధికారికంగా ప్రతిపాదనలు
అందితే స్పందిస్తాం.            
–దామోదరరావు, ఈయూ, ఆర్టీసీ గుర్తింపు సంఘం

ఉన్న ఉద్యోగాల్ని దూరం చేస్తారా?
ఆర్టీసీలో సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. పైగా ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తారా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయి.
–చల్లా చంద్రయ్య, ఎన్‌ఎంయూ అధ్యక్షుడు

ప్రైవేటీకరణ చేపట్టేందుకే ఈ దురాలోచన  
చంద్రబాబు సర్కారు ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ఎప్పట్నుంచో ఆలోచన చేస్తోంది. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో బెంబేలెత్తిన చంద్రబాబు సర్కారు ఉన్నఫళంగా ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు యత్నించడం దారుణం. మొదట్నుంచీ చంద్రబాబుకు ఆర్టీసీ అంటే చులకన భావనే.
–రాజారెడ్డి, వైఎస్సార్‌ ఆర్టీసీ యూనియన్‌ అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top