ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు

AP Special Status CPI CPM Leaders Protest In Kurnool - Sakshi

ఆస్పరి: ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని సీపీఎం, సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పరిలో సీపీఐ, సీపీఎం నాయకులు శుక్రవారం వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. సీపీఐ నాయకులు స్థానిక బస్టాండ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీపీఎం నాయకులు అంబేడ్కర్‌ సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు నాగేంద్రయ్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉందన్నారు.

ఎన్నికల సమయంలో 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ తర్వాత పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా ప్రజలను మోసం చేశాడన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కారుమంచి,  సీపీఐ, సీపీఎం, విరుపాక్షి, మాణిక్యప్ప, రామాంజినేయులు, నవీన్, రంగస్వామి, బ్రహ్మయ్య, రాజ్‌కుమార్, అంజినయ్య, రాజశేఖర్, ఉరుకుందప్ప, తిమ్మప్ప     తదితరులు పాల్గొన్నారు.

దేవనకొండ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, సాధించుకునేందుకు ఎందాకైనా పోరాటాలు నిర్వహిస్తామని సీపీఎం డివిజన్‌ నాయకులు వీరశేఖర్‌ అన్నారు. శుక్రవారం దేవనకొండ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలియజేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి, ఇప్పుడు చేతులెత్తేయడం ఏంటని ప్రశ్నించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top