‘అమరావతి రైతులకు మేము వ్యతిరేకం కాదు’

AP Public Associations JAC Leaders Praised YS jagan Decision - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజా సంఘాల జేఏసీగా స్వాగతిస్తున్నామని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వెనకబాటును గుర్తించి ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ లాంటి మహా నగరాన్ని వదిలి వచ్చినా ఢిల్లీ పెద్దలు ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ఒక్క ప్యాకేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కనీసం వెనుకబాటు అధ్యయనానికి ఒక్క కమిటీ, కమీషన్‌ గానీ వేయలేదని పేర్కొన్నారు. మద్రాస్‌, కర్నూలు, అమరావతిలో అద్దె రాజధానిలో ఉత్తరాంధ్ర ప్రజలు గడిపారని, విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ప్రకటించడంతో సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

అమరావతి రైతులకు తాము వ్యతిరేకం కాదని జేటీ రామారావు స్పష్టం చేశారు. రాష్ట్ర నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించి ఏపీకి ప్రాజెక్టులు,వెనుకబడి ప్రాంతాలు ప్యాకేజీలు ఇచ్చి ఏపీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించాలని శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీకి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. కమీటీ సిఫార్సులపై చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టకపోగా సిఫార్సులు చట్టబుట్టలో వేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే వంశధారా, పోలవరం ప్రాజెక్టుల  సమస్యలు తొలిగిపోతాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, 70 సంవత్సరాల తరువాత ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. 1956 విశాఖకు ఆంధ్రాయూనివర్సిటీ,1971లో స్టీల్ ప్లాంట్,2020 లో సీఎం జగన్‌ పుణ్యమా అని ఎగ్జిగుటివ్ రాజధాని వస్తుందన్నారు. అధికార వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు మారినా.. ఉత్తరాంధ్ర తలరాత మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

అదే విధంగా ‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం న్యాయం. హై కోర్టు బెంచ్‌లతో  అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు కల్పింది జవహర్ లాల్ నెహ్రు, ముంచింది ఇందిరాగాంధీ, రాచి రంపాన పెట్టింది సోనియా గాంధీ, నటిస్తున్నది నరేంద్రమోదీ. ఇంత బాధలో సైతం నేను ఉన్నానని ముందడుగు వేసింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జీయన్ రావ్, బోస్టన్ కమీటీలు అద్భుతమైన గ్రౌండ్ రియాలిటీ తో రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఏసీ  గదుల్లో కూర్చుని తయారు చేసినవి కావు ఆ నివేదికలు. వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలే జీవోలుగా చట్టాలవుతున్నాయి. చంద్రబాబు వినతి పత్రాలు ఏనాడు అయినా తీసుకున్నాడా.. ఆయన పాలనలో అరెస్టులు, బైండోవర్‌లే సరిపోయాయి. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్న వారికి సమస్యలు తెలుస్తాయి. చంద్రబాబు అమరావతి అంటూ అక్కడి రైతులను మభ్యపెట్టారు. వంశధార ప్రాజెక్టు,  భూమాలు కోల్పోయిన, స్టీల్ ప్లాంట్ కు భూముల ఇచ్చిన వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఇప్పటికే 3 తరాలు నష్టపోయాయి. వాటి గురించి చర్చించరు. ఎందుకు...? పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఉత్తరాంద్ర అభివృద్ధి అడ్డం పడవద్దని కోరుతున్నాము. అమరావతిలో అసెంబ్లీ  ఉంటుంది. రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యే లు అక్కడికి వస్తారు’’ అని జేఏసీ నేత జేటీ రామారావు స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top