కరకట్ట లోపల భవనాలను పరిశీలించిన మంత్రులు

AP Ministers Visits Buildings At Krishna Karakatta - Sakshi

సాక్షి, గుంటూరు : కృష్ణా నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు, మంత్రులు పరివాహక ప్రాంతంలో తాజా పరిస్థితిని అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు కరకట్ట లోపల ఉన్న భవనాలను పరిశీలించారు. 

కరకట్ట లోపల ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్‌ హౌస్‌తోపాటు, తులసి వనం మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం, నీటి మునిగిన పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బొత్స  మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాన్ని ఖాళీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వరద నీరు కరకట్టపైన ఉన్న నివాసాల్లోకి రావడంతో.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టామని చెప్పారు.  ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికోసం  వాడుకోవద్దని హితవు పలికారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే కరకట్టపై ఉన్న నివాసాల్లోకి నీరు ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజల భద్రతపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వరదలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేసేందుకు వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాబు నివాసం కూడా కరకట్టపైనే ఉండటం.. అక్కడ టీడీపీ శ్రేణులు హంగామా సృష్టించడం అందులో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ముంపు బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటాం..
అనంతరం మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌ కృష్ణ లంకలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ బొప్పన భవకుమార్‌ మంత్రులకు ముంపు సమస్యను వివరించారు. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని ముంపు బాధితులు మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంలో జాప్యం చేసి టీడీపీ ప్రభుత్వం తమ కొంపలు ముంచిందని మండిపడ్డారు. బాధితుల సమస్యలపై స్పందించిన మంత్రి బొత్స.. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ముంపు బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వర్షాలే రాని చంద్రబాబు పాలనలో వరదలు అంటే ఎవరికి తెలియవు.. అలాంటి మాజీలు ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమం లేకే ఈ ప్రాంతవాసులు ముంపుకు గురయ్యారని విమర్శించారు. నష్ట నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top