బాబుగారి నయా నాటకం

AP govt fail to implement Housing scheme - Sakshi

పక్కా గృహాల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం

మూడేళ్లలో నంద్యాల్లో నిర్మించింది కేవలం 456

కేంద్రం సాయాన్ని పక్కన పెట్టిన వైనం

మరోసారి మాటలతో మభ్యపెడుతున్న బాబు ప్రభుత్వం

సాక్షి అమరావతి: తిమ్మిని బమ్మిని చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ ఎప్పుడూ ముందుంటుంది. లేనిదానిని ఉన్నదానిగా చూపించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మించిన నాయకులు, పాలకులు మరొకరు ఉండరు. రాజధాని విషయంలో బొమ్మలు, గ్రాఫిక్స్‌లతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్న బాబుగారి ప్రభుత్వం, డొల్లతనం మరోసారి బయటపడింది. పేదల సొంతింటి కలలను కలగానే మిగిల్చుతోంది. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు పక్కా గృహాలను అందిస్తామని ఆర్భాటంగా చెప్పుకునే  ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు ఏమాత్రం చేయలేకపోయింది.

2015లో బలహీన వర్గాలకు గృహనిర్మాణ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం లక్ష 93వేల గృహాలు మంజూరు చేసింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.50 లక్షలు కేంద్రం అందిస్తుంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. తాజగా కేంద్ర ప్రభుత్వ ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి మరో 1.25 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకూ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 5.20 లక్షల ఇళ్లను కేటాయించింది. వీటికి నిధులను కూడా కేంద్రమే భరిస్తుంది. వీటిలో కనీసం 2శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా బడుగు బలహీన వర్గాలతో పాటు, పేదలందరికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది.  

అధికారంలోకి వస్తే ఐదేళ్లలో పది లక్షల పక్కా గృహాలు నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మర్చిపోయారు. గత మూడేళ్లలో బాబు సర్కార్‌ నిర్మించింది కేవలం పదివేల ఇళ్లు మాత్రమే. ఇందుకు ఖర్చు చేసింది కేవలం రూ.160కోట్లు. వాటిలో కూడా గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లు కూడా ఉండటం విశేషం. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వరర్గంలో గతమూడేళ్లలో నిర్మించింది కేవలం 359 ఇళ్లులు మాత్రమే. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజక వర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే ఎక్కువ ఇళ్లను (391) పట్టుపట్టి నిర్మించగలిగారు.

ఇదేళ్లలో 10లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం 10వేల ఇళ్లను కూడా పూర్తిచేయలేక పోవడం విడ్డూరం. ఇప్పుడు తాజాగా రూ16వేల కోట్లతో గృహనిర్మాణాలు చేపడతామని గొప్పలు పోతోంది. మూడేళ్లలో 150 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో రూ.16వేల కోట్లు ఎలా ఖర్చుపెట్టగలుగుతుందనే సందేహాలు రాకపోవడం లేదు.

ఇటీవల నంద్యాల ఉపఎన్నికల్లో నంద్యాల్లో 13వేల గృహాలు నిర్మించామని డప్పుకొట్టుకున్న చం‍ద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో నిర్మించిన ఇళ్లు 456 మాత్రమే. గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజక వర్గంలో పూర్తైన ఇళ్లు కేవలం 696 ఇళ్లు మాత్రమే. ఈ వివరాలు అన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గృహనిర్మాణ శాఖ వెబ్‌సైట్‌ నుంచి సేకరించిన సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top