ఎలుకల కోసం రూ.8.4 కోట్లు

Ap govt expenses 8.4 crores for rats - Sakshi

బోనులో మూషికాలు పడకపోయినా.. కాంట్రాక్టర్‌ జేబులోకి మాత్రం డబ్బులు 

పెద్దాసుపత్రుల్లో బెంబేలెత్తిస్తున్న కీటకాలు

సాక్షి, అమరావతి: రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా? అన్నట్లుగా  ప్రభుత్వం తల్చుకుంటే కాంట్రాక్టరుకు ఎలాగైనా లబ్ధి చేకూర్చవచ్చని నిరూపిస్తోంది. ఎలుకలను పట్టుకోవడాన్ని సైతం ఆదాయ వనరుగా మార్చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

టీడీపీ ముఖ్యనేతకు దగ్గరి బంధువు కావడంతో..
రాష్ట్రవ్యాప్తంగా పెద్దాసుపత్రుల్లో ఎలుకలు, కీటకాల నిర్మూలన పేరుతో ఏడాది వ్యవధిలో రూ.8.4 కోట్లు చెల్లించడంపై సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. బోనులో ఎలుకలు పడకున్నా కాంట్రాక్టర్ల జేబుల్లోకి మాత్రం డబ్బులు చేరాయని విమర్శిస్తున్నారు. గత రెండేళ్లలో ఎలుకలు పట్టినందుకు సదరు కాంట్రాక్టరుకు సుమారు రూ.17 కోట్ల వరకూ చెల్లించారు. టీడీపీ ముఖ్యనేతకు ఈ కాంట్రాక్టర్‌ సమీప బంధువు కావడం గమనార్హం. పెస్ట్‌ అండ్‌ రోడెంట్‌ కంట్రోల్‌ పేరుతో పని చేయకపోయినా కాంట్రాక్టర్‌కు భారీ లబ్ధి  చేకూరుస్తున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు.

నెలకు రూ.70 లక్షలు... 
రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు, అనుబంధంగా బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటిలో పారిశుధ్యం, కీటకాల నియంత్రణ, సెక్యూరిటీ సర్వీసులు గతంలో ఒకే కాంట్రాక్టరు కింద ఉండేవి. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకలు కొరకడంతో ఓ శిశువు మృతి చెందిన ఘటన అనంతరం పారిశుధ్యం నుంచి కీటకాల నియంత్రణను తొలగించారు. దీనికోసం ప్రత్యేకంగా టెండర్లు నిర్వహించి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. కీటకాల నియంత్రణకు సగటున రూ.70 లక్షలు చెల్లిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.8.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, బల్లులు, పాములు యధేచ్ఛగా సంచరిస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో ఆస్పత్రిలో నలుగురు సిబ్బందితో తూతూమంత్రంగా నీళ్ల మందు పిచికారీ చేస్తూ కీటకాలను నియంత్రించినట్లు నెలవారీ బిల్లులు వసూలు చేసుకుంటున్నారు. గుంటూరు, విశాఖపట్నం ఆస్పత్రుల్లో నెలకు రూ.7 లక్షలకు పైగా చెల్లిస్తున్నా కనీసం పది ఎలుకలను కూడా పట్టడం లేదని సిబ్బంది పేర్కొన్నారు. ఆపరేషన్‌ థియేటర్లలోకి ఎలుకలు చొరబడుతుండటంతో రోగులు హడలిపోతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top