ఉద్యోగులకు జూలై ఝలక్‌!

AP Government PRC Not Implemented - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ(పీఆర్సీ) ఏర్పాటులో తీవ్ర జాప్యం చేశారు. ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన మధ్యంతర భృతినీ ప్రకటించడంలో నాన్చుడు ధోరణి అవలంబించారు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాజేసింది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఈ అసంతృప్తి జ్వాలలు టీడీపీ విజయావకాశాలను మసి చేస్తాయని భయపడిన సర్కారు హడావుడిగా 20 శాతం ఐఆర్‌ ఇస్తున్నట్లు ప్రకటించేసింది. కానీ.దాన్ని వచ్చే జూలై నుంచి అమలు చేస్తారట!.. తక్షణమే చెల్లించాల్సిన ఐఆర్‌ను ఐదు నెలల తర్వాత నుంచి అమలు చేయడమేమిటని ఉద్యోగులు మండిపడుతున్నారు. జూలైలో అమలు చేసేదాన్ని ఇప్పుడే హడావుడిగా ప్రకటించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. పీఆర్సీ అమలులో జాప్యం కారణంగా రగిలిపోతున్న ఉద్యోగులను మభ్యపెట్టి, మచ్చిక చేసుకోవడం ద్వారా ఎన్నికల్లో వారి ఓట్లు పొందాలన్న రాజకీయ లక్ష్యమే తప్ప సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. ఐఆర్‌ ప్రకటనతో స్పష్టమవుతోందని ఉద్యోగులు అంటున్నారు.

సాక్షి, విశాఖపట్నం : గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. లేనిగొప్పలు చెబుతూ సమీక్షలు, సమావేశాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో పని చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక గుండెపోటుకు గురై మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. పోనీ ఎంత కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు, గౌరవం దక్కడం లేదు. సకాలంలో పదోన్నతులు లభిస్తున్నాయా అంటే అదీ లేదు. గద్దెనెక్కగానే పక్కనే ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిందన్న ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించి ఆ మేరకు బాండ్లు ఇచ్చారు.

ఇదిగో ఇస్తాం..అదిగో ఇస్తాం అంటూ నాలుగేళ్ల పాటు ఊరించి చివరకు గతేడాది జీపీఎఫ్‌ ఖాతాలో కాగితాలపై సర్దుబాటు చేశారే చప్ప చేతికిచ్చిన పాపాన పోలేదు.
11వ పేరివిజన్‌ కమిషన్‌(పీఆర్‌సీ) వేతనాలు 2018 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలి. అలా అమలు చేయాలంటే ఈ కమిషన్‌ 2017లోనే ఏర్పాటు చేయాలి. కానీ పీఆర్‌సీ కమిషన్‌ సకాలంలో ఏర్పాటు చేస్తే ఎక్కడ నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సి వస్తోందన్న ఆలోచనతో ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటును వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు ఉద్యోగ సంఘాల ఒత్తిడి తట్టుకోలేక గతేడాది మేలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అసితోష్‌ మిశ్రా చైర్మన్‌గా పీఆర్‌సీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ రిపోర్టు ఆరు నెలల్లో ఇవ్వాల్సి ఉంది. కానీ దాదాపు పది నెలలు కావస్తున్నా కమిషన్‌ నివేదిక ఇవ్వలేదు. దీంతో కనీసం మధ్యంతర భృతైనా ఇవ్వండంటూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చాయి.

ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఇవ్వలేమని ప్రభుత్వం తెగేసి చెప్పింది. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకైనా ఓ మాటైనా చెప్పండి చాలు అంటూ ఏపీ ఎన్‌జీవో సంఘం మాజీ నేత పరుచూరి అశోక్‌బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు ఆ బాధ్యతలు అప్పగించారు. యనమలతో జరిగిన చర్చల్లో 20 శాతం ఐఆర్‌కు పరుచూరి అండ్‌కో అంగీకరించడం.. ఆ వెంటనే చిట్టచివరి కేబినెట్‌లో ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్‌ ప్రకటిస్తున్నాం. అమలు మాత్రం జూలై నుంచి చేస్తాం అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం మేతో ముగియనుంది. పైగా మరో వారం పది రోజుల్లో ఎన్నికల కోడ్‌ అమలుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం తమను మభ్య పెట్టేందుకే ప్రభుత్వం ఐఆర్‌ను ప్రకటించిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి
రా
ష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 31,452 మంది ఉద్యోగులున్నారు. వారిలో 2,708 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 39,297 మంది పని చేస్తుండగా, వారిలో 2956 మంది మహిళలున్నారు. ఇక స్థానిక సంస్థలైన లోకల్‌ బోర్డుల్లో 11,232 మంది పని చేస్తున్నారు, వీరిలో 2,679 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇక 15 వేల మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. వీరంతా ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

గతంలో ఐఆర్‌ ఎప్పుడు ప్రకటించిన ఆ మరుసటి నెల నుంచే సర్దుబాటు చేసేవారని, కానీ ఇలా ప్రకటించిన ఆరు నెలలకు ఐఆర్‌ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదంటున్నారు. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉంటుందో? పోతుందో? తెలియదు. అలాంటప్పుడు ఇలా అర్థంపర్థం లేని మధ్యంతర భృతిని ప్రకటించి ఉపయోగమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి గిమ్మిక్కులు ఎన్ని చేసినా చంద్రబాబును మాత్రం ఈసారి నమ్మే ప్రసక్తే లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు తేల్చి చెబుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top