మన కందులు మనకే..

AP Government Plans To Distribute Lentils On Ration Card - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన కందులను కొనుగోలు చేసి తెల్ల రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కందుల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అనంతరం ప్రభుత్వం కందుల  కొనుగోళ్లు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ల ద్వారా కొనుగోలు చేసిన కందులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు బాధ్యతలను పౌరసరఫరాల విభాగానికి అప్పగించింది. కొనుగోలు చేసిన కందులను మిల్లుల ద్వారా  పప్పు తయారు చేసి పౌరసరఫరాల విభాగం ద్వారా తెల్లరేషన్‌ కార్డు లబ్ధిదారులకు అందించనున్నారు.

ఇప్పటికే జిల్లాలో మార్క్‌ఫెడ్‌ వద్ద ఉన్న కందుల్లో 500 టన్నులను అధికారులు కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. మిగిలిన కందులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇప్పటి వరకు గత ఏడాదికి సంబంధించి కొనుగోలు చేసిన 25వేల టన్నుల కందులతో పాటు ఈ ఏడాది కొనుగోలు చేసిన 34వేల టన్నుల కందులు మార్క్‌ఫెడ్‌ వద్ద ఉన్నాయి. ఇవి కాకుండా నాఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన 17వేల టన్నులు సైతం గోడౌన్‌లలో నిల్వ ఉన్నాయి. 

నెలకు 20 వేల టన్నులు అవసరం..
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కందులను దిగుమతి చేసుకునేది. తాజాగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు రాష్ట్రంలో కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న కందుల కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్‌కార్డులకు సంబంధించి ప్రతినెలా 20వేల టన్నుల కందులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లాతో పాటు కర్నూలు, కడప, గుంటూరు, నెల్లూరు, చిత్తూరుతో పాటు కృష్ణా జిల్లాలను రైతులు అధికంగా కంది పంట సాగు చేస్తున్నారు. రైతులకు పంట చేతికొచ్చే నాటికి మార్కెట్లో క్వింటాలు రూ.3,500 నుంచి రూ.4వేలు మాత్రమే ధర ఉంది. ఈ ధరకు కందుల అమ్మకాలు సాగిస్తే రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెట్టారు. దీంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా కందుల కొనుగోళ్లకు సిద్ధమైంది. క్వింటాలు రూ.5450 చొప్పున జిల్లా వ్యాప్తంగా 51వేల టన్నుల కందులు కొనుగోలు చేశారు. 

అర్హులైన రైతుల వద్ద కాకుండా అధికార పార్టీ నేతలు, దళారుల వద్ద కందుల కొనుగోలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కందుల ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో  క్వింటాలు కందులు రూ.3300 మాత్రమే ధర ఉంది. ఈ పరిస్థితుల్లో  ప్రభుత్వం కొనుగోలు చేసిన కందులను బయట మార్కెట్లో విక్రయిస్తే పెద్ద ఎత్తున నష్టాలు చవి చూడాల్సి వస్తుందని ప్రభుత్వం భావించింది. ఇదే సమయంలో తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఎటూ కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయించినందున కర్ణాటక, తమిళనాడుల నుంచి కందుల కొనుగోళ్లు నిలిపివేసి రాష్ట్ర వ్యాప్తంగా పండిన కందులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు చేసిన కందులను మిల్లుల ద్వారా పప్పు ఆడించి తెల్లరేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఎటూ కందుల కొనుగోళ్లకు సిద్ధ పడినందున మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల వద్ద ఉన్న కందులే కాకుండా తమ వద్ద నిల్వ ఉన్న కందులను సైతం కొనుగోలు చేయాలని రైతులతో పాటు రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.   

రైతులకు రూ.30 కోట్ల బకాయిలు..
జిల్లాలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, కందుకూరు, యర్రగొండపాలెం తదితర నియోజకవర్గాల్లో రైతులు ఏటా 1.50 లక్షల ఎకరాల్లో  కంది పంట సాగు చేస్తున్నారు. జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం 34వేల టన్నులు (రూ.184 కోట్లు) కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రైతులకు 80 శాతం డబ్బులు మాత్రమే చెల్లించారు. ఇంకా 20 శాతం డబ్బులు (దాదాపు రూ.30 కోట్లు) చెల్లించాల్సి ఉంది. ఈనెలాఖరుకు రైతుల డబ్బులు చెల్లించనున్నట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top