గ్రామాల్లో కొలువుల జాతర

AP Government Has Announced Notification For Grama Sachivalayam Posts - Sakshi

సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : గ్రామాల్లో స్వచ్ఛమైన పాలన అందించే మంచి రోజులు కొద్దిరోజుల్లోనే రానున్నాయి. మహాత్ముడి గ్రామ స్వరాజ్య లక్ష్యం సాకారం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలో భాగంగా గ్రామాల్లో పారదర్శక పాలన తీసుకొచ్చే ప్రయత్నాలకు అడుగులు పడుతున్నాయి. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. అలాగే కనీసం 3 వేలమంది జనాభా ఉన్న గ్రామానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి శాతం పెరగడమే కాకుండా అక్రమాలు, లంచాలకు తావులేని వ్యవస్థను అందించే వీలుంటుంది. దూర ప్రాంతాలకు వలస పోతున్న యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తూ విధాన నిర్ణయం తీసుకోవడం ద్వారా నిరుద్యోగ సమస్యకు సీఎం చెక్‌ పెట్టారు. ఈ నిర్ణయంతో జిల్లాలో మొత్తం పల్లెల్లోనే 20,274 ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో అత్యధికంగా వలంటీర్లు 11,924 కాగా, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 8,350 వరకు ఉన్నాయి.

దీంతో వేలాది మంది పల్లె యువకులకు ఉద్యోగ వరం లభించనుంది. ఇవే కాకుండా శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ, రాజాం మున్సిపల్‌ ప్రాంతాల్లో కూడా వార్డు వలంటీర్లు 1704 పోస్టులతోపాటు వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు రానున్నాయి.

8,350 సచివాలయ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌
గ్రామాల్లో స్థిరమైన పాలన, పారదర్శకంగా ఉండాలనే ధ్యేయంతో సీఎం జగన్, స్థానికంగా ఉన్నత విద్యార్హతలున్న నిరుద్యోగులకు అక్కడే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా ‘సచివాలయ ఉద్యోగాల కల్పన’ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈమేరకు ప్రతి గ్రామ సచివాలయానికి పది ప్రభుత్వ ఉద్యోగాలు లభించనున్నాయి. ఈమేరకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించి, ఉద్యోగాలకు పారదర్శకంగా ఎంపిక చేయనున్నారు.

ఈ ఏడాది అక్టోబర్‌ 2న ఈ కొత్త కొలువులతో అన్ని గ్రామ సచివాలయాలు కళకళలాడనున్నాయి. జిల్లాలో మొత్తం 1141 గ్రామ పంచాయతీల్లో 835 గ్రామ సచివాలయాలు (సెక్రటేరియట్లు) ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఒక్కో సచివాలయానికి పది ఉద్యోగాల చొప్పున జిల్లాలో మొత్తం 8350 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఇదిలావుంటే జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నిర్వహించనున్న రాత పరీక్షలో ఎంపికైన ఉద్యోగులను రెండేళ్లపాటు ప్రొబేషనరీగా ఉంచి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించనున్నారు.

ఇప్పటికే పంచాయతీల్లో ఉన్న ఉద్యోగులు కాకుండా అదనంగా మరో 10 మందిని ప్రతి సచివాలయానికి కేటాయించనున్నారు. దీంతో నిరుద్యోగ సమస్య కొంతమేరకు తీరనుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న యువతకు.. ఇప్పుడు మంచి కాలం వచ్చినట్లయింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top