డ్వాక్రా మహిళలకు  శుభవార్త

AP Government Good News To Dwacra Women - Sakshi

మహిళా సంఘాల రుణమాఫీపై  కసరత్తు

అర్హులైన సభ్యుల వివరాలు అప్‌లోడ్‌

నాలుగు విడతల్లో సభ్యుల ఖాతాకు జమ

జిల్లాలో 35,922 సంఘాలకు లబ్ధి

హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్వాక్రా మహిళల రుణాల మాఫీ కోసం కసరత్తు మొదలైంది. ఇప్పటికే రుణాల వివరాలు అప్‌లోడ్‌ చేయడంలో సిబ్బంది తలమునకలవుతోంది. రుణమాఫీపై సంఘాల సభ్యులకు వెలుగు ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్లలో మాఫీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమచేసేలా చర్యలు చేపడుతున్నారు.

సాక్షి, వేపాడ (శృంగవరపుకోట): మహిళా సంఘాల సభ్యులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా వైఎస్‌ఆర్‌ అసరా పేరుతో మహిళా సంఘాల రుణాల మాఫీ అమలుకు చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెర్ఫ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ అధికా రుల ఆదేశాలతో మండల స్థాయిలో వెలుగు సిబ్బంది అర్హులైన సంఘాలు, సభ్యుల పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించి అప్‌లోడ్‌ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లోని 35,922 మహిళా సంఘాల్లో 3,95,142 మంది సభ్యులను వైఎస్సార్‌ ఆసరా పథకానికి అర్హులుగా గుర్తించారు. దీనిద్వారా సుమారు రూ. 897 కోట్లు మహిళా సంఘ సభ్యులకు లబ్ధి చేకూరనుంది.

ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగానే... వైఎస్సార్‌ ఆసరా పథకంలో మహిళాసంఘాల సభ్యులకు 2019 ఏప్రిల్‌ 11వ తేదీ నాటికి ఎంత బకాయి ఉన్నారో దానిని మాఫీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అర్హులను గుర్తించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించటంతో క్షేత్ర స్థాయిలో అధికారులు ఆ వివరాలు సేకరిస్తున్నారు. రుణ వివరాలను సెర్ప్‌ యాప్‌లో వెలుగు సిబ్బంది అప్‌లోడ్‌ చేస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు విడతల్లో సభ్యుల ఖాతాలకు జమచేయనున్నారు.

గత ప్రభుత్వం మోసం చేసింది...
గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మహిళలను మోసం చేసింది. గత ఎన్నికల్లో రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ప్రచారం చేసి గద్దెనెక్కాక ఆ హామీని విస్మరించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుండటంతో మహిళల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

85శాతం అప్‌లోడ్‌ పూర్తి చేసాం...
జిల్లాలో వైఎస్సార్‌ ఆసరా పథకంలో అర్హులైన సం ఘాల సభ్యులకు సంబం ధించి  ఖాతానంబర్, ఆధార్‌తో 85 శాతం అప్‌లోడ్‌ చేశాం. పలు మండలాల్లో సభ్యుల ఆధార్‌ అనుసంధానం, సాధికార సర్వే సాంకేతిక లోపంలో మిగిలివున్నాయి. వాటిని 10 రోజుల్లో అప్‌లోడ్‌ చేయాలని సూచించాం. జిల్లాలో 35,922 సంఘాలు ఆసరా పథకంలో అర్హత పొందాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నేరుగా సభ్యుల ఖాతాలో జమచేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
– జి.శాంతి, డీఆర్‌డీఏ పీడీ. విజయనగరం

ఆనందంగా వుంది..
జగన్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు దిశగా గణాంకాలు వేయటంతో మా సంఘానికి సుమారు రూ. 5 లక్షలు రుణమాఫీ కానుంది. మా సంఘ సభ్యులంతా ఇప్పటికే ఆధార్, బ్యాంకు ఖాతానంబర్లు అప్‌లోడ్‌ చేయించుకున్నాం.
– బొట్ట పార్వతి, చిన్నమ్మలు మహిళాసంఘం, వేపాడ

మహిళలకు ఆసరా వర్తిస్తోంది...
గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హా మీ సీఎమ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిలబెట్టుకునేం దుకు సన్నాహాలు చేయటం సంతోషంగా ఉంది.
– బోజంకి మాధవి, శ్రీవేంకటేశ్వర మహిళాసంఘం, వేపాడ

రూ. 4.50లక్షలు రుణమాఫీ అవుతోంది...
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీ అమలు చేయటంవల్ల మా సంఘానికి రూ. 4.50లక్షలు రుణమాఫీ వర్తిస్తోంది. మా సంఘంలో 15 మంది సభ్యులకు లబ్ధి కలగనుంది. మహిళలకు మరింత ఆసరా కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు
– ద్వారపూడి మంగ, శ్రీసాయి సంఘం, బొద్దాం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top