ఎంసెట్ స‌హా ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా

AP EAMCET Postponed Due To Coronavirus Outbreak - Sakshi

సెప్టెంబ‌ర్‌ మూడో వారంలో ఎంసెట్‌ నిర్వ‌హ‌ణ‌

డిగ్రీ, పీజీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా

సాక్షి, అమరావతి: క‌రోనా మ‌హ‌మ్మారి ప్రబ‌‌ళుతున్న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసు‌కుంది. ఏపీలో ఎంసెట్ స‌హా అన్ని ర‌కాల‌ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్లు సోమ‌వారం విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ ప్ర‌క‌టించారు. క‌రోనా నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సూచ‌న‌తో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌ల‌తో క‌లిపి మొత్తం 8 సెట్ల ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్ మూడో వారంలో ఎంసెట్ నిర్వ‌హిస్తామ‌ని, దీనికి సంబంధించిన ప‌రీక్షా తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొన్నారు. జాతీయ ఎంట్రన్స్ పరీక్షలకు ఆటంకం క‌ల‌గ‌కుండా వీటిని నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. డిగ్రీ, పీజీలో మొదటి, రెండో సంవత్సరం సంబంధించి సెమిస్ట‌ర్ పరీక్షలు వాయుదా వేస్తున్నామ‌న్నారు‌. సెప్టెంబర్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

డిగ్రీ విద్యార్థుల‌కు నూత‌న సిల‌బ‌స్‌
"20-21 ఏడాదికి అండర్ గ్రాడ్యుయేషన్‌కు కొత్త సిలబస్ ప్రవేశ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనిపై నిపుణుల కమిటీ 6నెలల పాటు అధ్యయనం చేసి సిలబస్ రూపొందించింది. ఈ నూత‌న సిల‌బ‌స్ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు కానుంది. విద్యార్థుల్లో నైపుణ్యత పెంచేలా లైఫ్ స్కిల్ కోర్సులను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశపెడతాం. కొత్త సిలబస్‌లో భాగంగా మొట్టమొదటి సారిగా పదినెలల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేస్తున్నాం. ఆన్‌లైన్‌, మాక్ కోర్సుల ఆధారంగా విద్యార్థులను ప్రోత్సహిస్తాం. ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్‌, నేషనల్ గ్రీన్‌కోర్‌కు ప్రాధాన్యత ఇస్తాం. విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్‌ను పెంచేలా చర్యలు తీసుకుంటాం. సిలబస్ మార్పు వల్ల విద్యార్థుల నైపుణ్యం పెరగడం, ఉద్యోగ కల్పన, ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుంది" అని మంత్రి ఆదిమూల‌పు సురేశ్ పేర్కొన్నారు

 (సెట్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top