మహిళల భద్రతే సీఎం జగన్‌ లక్ష్యం

AP DGP Gautam Sawang Video Conference - Sakshi

‘దిశ’ పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

సాక్షి, అమరావతి: 2020ని 'ఉమెన్ సేఫ్టీ ఇయర్‌’గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. రాష్ట్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా నేటి నుంచి మరో 12 దిశ పోలీస్‌స్టేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నుంచి  దిశ పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సీఎం లక్ష్యానికి అనుగుణంగా పనిచేసేందుకే ‘దిశ’ ఉమెన్‌ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో మహిళా మిత్రలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పోలీస్‌స్టేషన్‌లకు మహిళలు నిర్భయంగా వచ్చి బాధలు చెప్పుకునే పరిస్థితి కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్‌లకు రావాలంటే మహిళలు భయపడే రోజులు పోవాలన్నారు. మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి చేపట్టిన ‘దిశ’లో భాగస్వాములు కావటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని.. పూర్తిస్థాయి భద్రతతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడతామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో గతం కంటే ఇప్పుడు ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు.

నేటి నుంచి అందుబాటులో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు
రాష్ట్రంలో నేటి నుంచి 18 దిశ  పోలీస్‌స్టేషన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని ‘దిశ చట్టం’ ప్రత్యేక అధికారి దీపిక పాటిల్‌ అన్నారు. ‘దిశ ఎస్‌ ఓ ఎస్‌ యాప్‌’కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే 122 కాల్స్‌ వచ్చాయని 37 ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు అయ్యాయని తెలిపారు. తమ పొరుగు మహిళలు ఆపదలో ఉన్నారని పురుషుల నుంచి సైతం కాల్స్‌ వస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఈచ్‌ ఫర్‌ ఈక్వల్‌’ అనే నినాదం ఇస్తున్నామని చెప్పారు. పొరుగు మహిళల కష్టాలు చూసి తోటి మహిళలు సైతం ఫిర్యాదులు ఇస్తున్నారని పేర్కొన్నారు. 

ఈవ్‌టీజర్ల బెడద తప్పింది..
వీక్లీ ఆఫ్‌తో వారంలో ఒక రోజు కుటుంబం అంతా కలిసే అవకాశం కలుగుతుందని ‘దిశ’ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. దిశ యాప్‌తో ఈవ్‌టీజర్ల బెడద చాలా వరకు తప్పిందని డీజీపీకి మహిళా మిత్రలు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో మహిళలు నిర్భయంగా ఉన్నారన్నారు. అఘాయిత్యాలు, వేధింపులకు చెక్‌ పెట్టడంతో మహిళల్లో భరోసా కనిపిస్తోందని తెలిపారు. ‘దిశ యాప్‌’పై విస్తృత ప్రచారం కల్పించి.. అధిక మంది డౌన్‌లోడ్‌ చేసుకునేవిధంగా కృషి చేయాలని డీజీపీని మహిళా మిత్రలు కోరారు.

ఏలూరు: మహిళా భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ‘దిశ’ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కోటదిబ్బలో దిశ మహిళా పోలీస్టేషన్‌ను కలెక్టర్‌  ముత్యాలరాజు, డీఐజీ  కేవీ మోహన్‌రావు, ఎస్పీ నవదీప్‌ సింగ్‌గ్రేవాల్‌ ప్రారంభించారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top