అసైన్డ్‌ భూములపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

AP Cabinet Approves Key Decision On Assigned Lands - Sakshi

అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు రద్దు 

సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలోని రాజధాని అసైన్డ్‌ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత‍్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో అసలైన అసైన్డ్‌ దారులకు ప్రభుత్వ నిర్ణయం భారీ ఊరటనిచ్చింది. అసలైన అసైన్డ్‌దారులకు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నిర్ణయించింది.

ఫిబ్రవరి 17,2016న జీఓఎంఎస్‌ –41 ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దు చేస్తూ... ఏపీ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌)–1977 నాటి చట్టాన్ని ఉల్లంఘించారన్న మంత్రివర్గం..అసలైన అసైన్డ్‌దారులకు రెసిడెన్షియల్, కమర్షియల్‌పాట్లు కేటాయించాలని నిర్ణయించింది. కాగా గత ప్రభుత్వ నిర్ణయంతో అసలైన అసైన్డ్‌ దారులకు నష్టం కలిగిన విషయం తెలిసిందే.

 కేబినెట్‌ కీలక నిర్ణయాలు
బుధవారం సాయంత్రం సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మహిళలు, చిన్నారులకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇటీవల ‘దిశ’ సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌ పేరుతో కొత్త చట్టం)ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ) చట్టం 2019 ( ఏపీ దిశ యాక్ట్‌) మరియు ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 

గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణలకు బలోపేతమైన యంత్రాగం ఏర్పాటు చేయడానికి కొత్త శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.సకాలంలో లక్ష్యాలను సాధించడానికి ఇతర శాఖలతో సమన్వయం చేసుకునే దిశగా అడుగులు వేసింది. ఉద్యోగులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు వారిలో లక్ష్యాలపై స్పష్టత తీసుకురావడం, భాగస్వామ్యంద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడమే ఉద్దేశంతో కొత్త శాఖను ఏర్పాటు చేసింది.

ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం కొరకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు అనుమతి. రవాణా, రోడ్లు– రహదారులు–భవనాలశాఖలోనే ఈ విభాగం ఏర్పాటు కనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగినట్టుగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకరించింది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సేవల కొనసాగనున్నాయి.

కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపంసహరణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తుని ఘటన సహా కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణకు ఆమోదం తెలిపింది. అలాగే భోగాపురం భూసేకరణ సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయం

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక మార్గదర్శకాలకు మంత్రివర్గం ఆమోదంతో పాటు గతంలో ఉన్న మార్గ దర్శకాలను సవరించిన సవరించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెల ఆదాయం రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12లోపు ఆదాయం ఉన్నవారికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక వర్తించనుంది. గతంలో కన్నా.. నెలవారీ ఆదాయపరిమితి పెంపు. మూడు ఎకరాల పల్లం లేదా, 10 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక వర్తిస్తుంది. సొంతంగా కారు ఉన్నవారు అనర్హులు. ట్యాక్సీ, ట్రాక్టర్లు,  ఆటోలు ఉన్నవారికి మినహాయింపు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు ఇల్లు ఉన్నవారు అర్హులు. కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులు.

ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. రూ. 101 కోట్లతో షేర్‌ క్యాపిటల్‌తో ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్‌ మిల్లెట్‌బోర్డు చట్టం 2019 ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదం. కరవు, వర్షభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును పెంచేందుకు బోర్డు ఏర్పాటు. చిరుదాన్యాల బోర్డులు ఏర్పాటు ముసాయిదా బిల్లులకు ఆమోదం. అలాగే ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ రుణ పరిమితి మరో రూ.3వేల కోట్లు పెంచేందుకు అంగీకారం. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.22వేల కోట్లు

ఇక ఆంధ్రప్రదేశ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే అక్రమంగా మద్యాన్ని తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లు ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదించింది. ఈ నేరాలను నాన్‌ బెయిలబుల్‌ కేసులుగా పరిగణిస్తున్న బిల్లు. 6నెలల నుంచి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష. మొదటిసారి పట్టుబడితే జరిమానా రూ.2 లక్షలు, రెండోసారి పట్టుబడితే జరిమానా రూ.5 లక్షలు.బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్‌ ఫీజు కన్నా 2 రెట్లు జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్‌ రద్దు. ఆంధ్రప్రదేశ్‌ టాక్స్‌ ఆన్‌ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ అమెండమెంట్‌ బిల్‌ –2019కు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. 

అలాగే వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్ల జీతాల పెంపుదలకు మంత్రివర్గం అంగీకారం. వారికి రూ.10వేల చొప్పున జీతాలు పెంచుతూ ఇటీవలే నిర్ణయం. తాజా నిర్ణయంతో 27,797 మందికి లబ్ధి. ఆంధ్రప్రదేశ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ (ఏపీసీఎస్‌) చట్టం 1964లో సెక్షన్‌ 21–ఎ (1) (ఇ)  సవరణకు ఆమోదం. చిత్తూరుజిల్లా ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో 15 ఎకరాల 28 సెంట్ల భూమి ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి కేటాయింపునకు అంగీకారం.

అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిచేస్తూ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన.తదుపరి సంవత్సరాల్లో ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మాధ్యమంలో బోధన తప్పనిసరి. 

ఏపీ స్టేట్‌ యూనివర్శిటీ యాక్ట్‌లో సవరణలతో పాటు,  వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు. యూనివర్శిటీలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, కాలేజ్‌ ఆఫ్‌ఫైన్‌ ఆర్ట్స్‌ ఏర్పాటు. రెండు కాలేజీల్లో ఐదు విభాగాలు. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ లేదా ఆయనచే నియమించబడిన వ్యక్తి అన్ని యూనివర్శిటీల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియామకానికి ఆమోదం తెలిపింది.

అలాగే కర్నూలులో క్లస్టర్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం. సిల్వర్‌ జూబ్లీ డిగ్రీకాలేజీ, కేవీఆర్‌ గవర్నమెంట్‌ డిగ్రీకాలేజీ, గవర్నమెంట్‌ డిగ్రీకాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్‌ యూనివర్శిటీగా ఏర్పాటు చేసేందుకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక విభాగం కమిషన్‌ ఛైర్మన్‌ గా వంగపండు ఉష నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top