నిరుద్యోగులకు జెన్‌కో షాక్‌

AP APGENCO gives shock treatment to unemployeers - Sakshi

 గరిష్ట వయోపరిమితిని 42 నుంచి 34 ఏళ్లకు కుదింపు

 ఇదేమి తీరంటూ నిరుద్యోగుల ఆగ్రహం  

సాక్షి, ప్రొద్దుటూరు : ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. ‘బాబు వస్తే జాబు’ వస్తుందని నినాదాలతో అధికారం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం జెన్‌కో నోటిఫికేషన్‌లో వయో పరిమితి కుదించడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. ఏడేళ్ల నుంచి అకౌంట్స్‌ విభాగంలో జూనియర్‌ అకౌంట్స్‌ అఫీసర్ల కోసం ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఇటీవల 22 జేఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటితో పాటు మరో 4 పోస్టులను బ్యాక్‌ లాగ్‌ కింద భర్తీ చేయనుంది. జనరల్‌ కేటగిరీ వారికి గరిష్ట వయసు అర్హతను 34 ఏళ్లుగా పేర్కొనడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఈ ఏడాది మార్చిలో అసిస్టెంట్‌ ఇంజినీర్ల పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లో గరిష్ట వయో పరిమితి 42 ఏళ్లుగా పేర్కొన్న జెన్‌కో ఏడు నెలల్లోనే ఏకంగా 8 ఏళ్లు తగ్గించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. చాలా మంది గత కొద్ది రోజులుగా సీఎం, విద్యుత్‌శాఖాధికారులకు, జెన్‌కో ఉన్నతాధికా రులకు మెయిల్స్, ఫ్యాక్స్‌లు పెడుతున్నారు. ఏడేళ్ల తరువాత వచ్చిన నోటిఫికేషన్‌కు వయసును 42 ఏళ్లకు పొడగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే జూనియర్‌ అసిస్టెంట్‌(ఎల్‌డీసీ) ఉద్యోగాలకు జెన్‌కో నోటిఫికేషన్‌ ఇవ్వడం ఇదే ప్రథమం. ఎన్నో ఏళ్లుగా జెన్‌కోలో ఎల్‌డీసీ పోస్టులు భర్తీ చేస్తారని ఎదురుచూసిన నిరుద్యోగలకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జెన్‌కో అధికారులు అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్లు పెంచాలని నిరుద్యోగులు విన్నవిస్తున్నారు.

గందరగోళంగా సిలబస్‌
ఈ పోస్టులకు ఇచ్చిన సిలబస్‌ కూడా గందరగోళంగా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నాలుగు సెక్షన్లలో వివిధ అంశాలపై పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నాలుగు సెక్షన్లలో దేనికింద ఎన్ని మార్కులు ఉంటాయన్న విషయం నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. దీంతో కొద్ది సమయంలోనే  ఏయే అంశంపై అధిక ప్రాధాన్యం ఇవ్వాలనేది నిర్ణయించుకోలేక పోతున్నారు. సాధారణంగా బ్యాంకు, రైల్వే ఉద్యోగాలకు ఇచ్చే నోటిఫికేషన్‌ల్లో కూడా ప్రతి సెక్షన్‌లో ఎన్ని ప్రశ్నలు, ఎన్ని మార్కులు ఉంటాయో స్పష్టంగా పేర్కొంటారు. కానీ ఇందులో సెక్షన్లకు సంబంధించి మార్కులను తెలపక పోవడంపై నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీని బదులు 2010లో విడుదల చేసిన జేఏఓ నోటిఫికేషన్‌లోని సిలబస్‌నే ఉంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.  

రెండు పరీక్షలు ఒకే రోజు
జూనియర్‌ అసిస్టెంట్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(జేఏఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్‌ 2 వరకు గడువు విధించారు. వీటికి డిసెంబర్‌ 30న పరీక్షలు నిర్వహిస్తుండటంతో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు నష్టపోవాల్సి వస్తోంది. ఏదో ఒక పరీక్షే రాయాల్సి వస్తుండటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని వారు కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top