తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళనపథంలో కాలిడిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో విధులను
విధులను వీడి వీధుల్లోకి..
Feb 18 2014 3:37 AM | Updated on Jun 2 2018 8:29 PM
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళనపథంలో కాలిడిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించి, సమ్మెకు పూనుకున్నారు. గౌరవ వేతనం పేరుతో ఇచ్చే మొత్తం నెలవారీ కాఫీ, టీ ఖర్చులకు కూడా చాలదని ఆక్రోశించారు. ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ తమ శ్రమను కారుచౌకగా పొందుతోందని, తమ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ‘గౌరవ వేతనం మాకొద్దు... కనీస వేతనం అమలు చేయాలి’ అని ఎలుగెత్తారు. ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుతో ఈనెల 3 నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టిన అంగన్‌వాడీలు సోమవారం నుంచి సమ్మె ప్రారంభించారు. సమ్మెతో జిల్లావ్యాప్తంగా 5 వేల అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ఆందోళనను ఉధృతం చేసే కార్యాచరణలో భాగంగా చేపట్టిన సమ్మెలో తొలిరోజు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల రాస్తారోకో చేశారు. న్యాయమైన తమ కోర్కెల సాధన కోసం ఎలాంటి పోరాటానికైనా వెనుకాడేది లేదని అంగన్‌వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.వీరలక్ష్మి స్పష్టం చేశారు.
Advertisement
Advertisement