తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల బాహాబాహీ | andhra pradesh and telengana employees clash at dmhs office | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల బాహాబాహీ

Jun 1 2014 10:31 AM | Updated on Sep 6 2018 3:01 PM

తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల బాహాబాహీ - Sakshi

తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల బాహాబాహీ

కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌లో 210 జీవోకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది.

పరస్పర దాడులతో డీఎంహెచ్‌ఎస్‌లో ఉద్రిక్తత
 
హైదరాబాద్ : కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయంలో 210 జీవోకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఒక ఉద్యోగిపై మరో అధికారి దాడి చేయడంతో తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పర వాగ్వాదాలు, తోపులాటలతో ఆ ప్రాంతం అట్టుడికింది. వివరాలు.. రాష్ట్ర విభజన  నేపథ్యంలో డీఎంహెచ్‌ఎస్‌లోని వైద్యవిధాన పరిషత్, డెరైక్టర్ ఆఫ్ హెల్త్, డీఎంఈ, కుటుంబ సంక్షేమశాఖ తదితర విభాగాల్లోని తెలంగాణ ఉద్యోగులను బంజారాహిల్స్‌కు వెళ్లిపోవాలని ప్రభుత్వం 210 జీవో జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం నేత పి.హరిబాబు నేతృత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగ జేఏసీ, వైద్య జేఏసీలకు చెందిన ఉద్యోగులు నిరసనకు దిగారు.

డీఎంహెచ్‌ఎస్ కార్యాలయం గేటుకు తాళం వేసి, ఇతర ఉద్యోగులను అడ్డుకున్నారు. గేటు వద్ద ఉన్న ఉద్యోగిపై ఓ అధికారి చేయిచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఉద్యోగులు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలోకి దూసుకుపోయి విద్యుత్‌ను నిలిపివేసి, అక్కడ ఉన్న ఆంధ్రా ఉద్యోగులపై దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయినా తెలంగాణ ఉద్యోగులు సాయంత్రం వరకు తమ నిరసన కొనసాగించారు. ఇలాంటి జీవోలను జారీ చేయడంలో కుట్ర దాగుందని జేఏసీ నేతలు హరినాథ్, జూపల్లి రాజేందర్, పుట్లా శ్రీనివాస్‌లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement