‘లక్ష్యాన్ని ప్రేమతో సాధించాలి’ | Andhra Cricket Association Director Venu Gopal Rao Interview | Sakshi
Sakshi News home page

‘లక్ష్యాన్ని ప్రేమతో సాధించాలి’

Feb 17 2020 11:09 AM | Updated on Feb 17 2020 11:46 AM

Andhra Cricket Association Director Venu Gopal Rao Interview - Sakshi

సాక్షితో మాట్లాడుతున్న మాజీ అంతర్జాతీయ క్రికెటర్, ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ వై.వేణుగోపాలరావు

ఏ అంశంలోనైనా గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు భావిస్తారు. క్రీడా రంగంలో.. అందులోనూ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్న క్రికెట్‌ క్రీడ విషయంలో గెలుపు ముఖ్యం కాకూడదు. ఎంత బాగా మన ఆట తీరును ప్రదర్శించాం... ఎంత మందిని ప్రోత్సహించామన్నదే ప్రధానం. ప్రతిభ గల క్రీడాకారులను  ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది.
ఏసీఏ డైరెక్టర్‌ వై.వేణుగోపాలరావు 

త్వరలో ఇండియా జట్టులోకి మన కుర్రోళ్లు... 
ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు సాధనలో రాటుదేలుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు హనుమ విహారి, కె.ఎస్‌.భరత్‌ ఇండియా తరఫున ఆడుతున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. త్వరలో మరో ముగ్గురికి అవకాశం దక్కనుంది. విశేషమేమిటంటే  ఆంధ్రప్రదేశ్‌ జట్టు రంజీ ట్రోఫీలకు క్వాలిఫై కావటం. క్రికెట్‌ చరిత్రలో ఇదో మంచి పరిణామంగా  చెప్పవచ్చు. మన క్రీడాకారుల ప్రతిభకు ఇది తార్కాణంగా నిలుస్తుంది.  

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహం 
గ్రామీణ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏసీఏ అధిక ప్రాధాన్యమిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే విజయనగరం వంటి జిల్లాలో రెండు నుంచి మూడు మైదానాలు ఏర్పాటు చేశాం. త్వరలో శ్రీకాకుళం, తిరుపతి నగరాల్లో మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం.  ఆయా మైదానాల్లో శిక్షణ పొందేందుకు వచ్చే వారి కోసం శిక్షకులను ఏర్పాటు చేస్తాం. ఉన్నకాడికి వనరులను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేధించగలిగే స్థాయికి క్రీడాకారులు ఎదగాలి. 

ఫ్రీగా ఏసీఏ కోసం పని చేస్తున్నా... 
అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తరువాత  ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. 70 ఐపీఎల్‌ మ్యాచ్‌లు... 16 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడాను. కానీ తాజాగా చేపట్టిన బాధ్యతలతో ఆనందంగా ఉంది. ఇంతకుముందు వారంతా నెలకు రూ. 3లక్షల వరకు జీతం తీసుకునేవారు. నేను మాత్రం అటువంటి రెమ్యూనరేషన్‌కోసం ఆశపడలేదు. ఫ్రీగానే బాధ్యతలు నిర్వహిస్తున్నాను.  ఆంధ్రాలో క్రికెట్‌ క్రీడాకారులను తయారుచేయటమే ధ్యేయం.  

ఎన్నో కష్టాలు పడ్డా... 
మా స్వస్థలం విశాఖ జిల్లా గాజువాక. అక్కడే చిన్న స్టేడియంలో నిత్యం సాధన చేసే వాడ్ని. క్రికెట్‌లో రాణించాలన్నది నా లక్ష్యం. అందుకు అనుగుణంగానే కష్టపడ్డాను. ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఇష్టంగా ఎదుర్కొన్నా. మద్రాసు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఆడేందుకు వెల్లాల్సిన అవసరం వచ్చిన సమయంలో  ట్రైన్‌లో జనరల్‌ బోగీలోని బాత్‌రూం పక్కన కూర్చొని వెల్లిన రోజులున్నాయి. బెంగళూరులో డార్మిటరీలో పడుకుని ప్రాక్టీస్‌కు వెళ్లాను. ఇన్ని కష్టాలు పడ్డ తరువాత అంతర్జాతీయ యవనికపై ఆడే అవకాశం దక్కింది. అప్పుడు ఈ కష్టాలన్నింటినీ మర్చిపోయాను.  

కుటుంబ ప్రోత్సాహం మరువలేనిది... 
అమ్మ.. నాన్న... ఐదుగురు అన్నదమ్ములం... అందులో నేను నాల్గవ వాడిని. నా తమ్ముడు జ్ఞానేశ్వర్‌ ఇండియా అండర్‌–19 జట్టుకు ఆడాడు. అమ్మనాన్నల ఇష్టంతో ప్రమేయం లేకుండానే క్రికెట్‌లోకి దిగాను. ఎవ్వరూ అడ్డుచెప్పలేదు. మా అన్నదమ్ములంతా ఆంధ్రా జట్టుకు ఆడినవారే. నేనొక్కడినే ఇండియాకు ఆడాను. ఆంధ్రా నుంచి తక్కువ మంది క్రీడాకారులు ఇండియాకు ఆడిన వారు ఉన్నారు. వారి సంఖ్య మరింత పెరగాలన్నదే నా లక్ష్యం. అందుకోసం నా శాయశక్తుల పని చేస్తా. ఈ విషయంలో నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉంటున్నా. మూడు నెలల తరువాత విశాఖలో అమ్మ, నాన్న దగ్గరకు వెళ్లా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement