మేయర్‌..ఎమ్మెల్యే..ఓ కమిషనర్‌

Anantapur TDP Party leaders Target To Commissioner PVVS Murthy - Sakshi

రచ్చకెక్కిన టీడీపీ వర్గవిభేదాలు

కమిషనర్‌ బదిలీకి ఎమ్మెల్యే వర్గం మంతనాలు

బదిలీ చేస్తే రాజీనామాకు సిద్ధమంటున్న మేయర్‌

సెలవుపై వెళ్లే యోచనలో కమిషనర్‌

ఎన్నికల వేళ కార్పొరేషన్‌లోని ఖజానా లూటీ చేసేందుకు టీడీపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారా..? అందుకు అడ్డుగా ఉన్న కమిషనర్‌కు పొగపెడుతున్నారా..? రాజకీయ ఆధిపత్యం కోసం మరోవర్గం పావులు కదుపుతోందా..? అంతిమంగా అందరూ కమిషనర్‌... కార్పొరేషన్‌ అధికారులనే టార్గెట్‌ చేస్తున్నారా..? మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ అనంతపురం కార్పొరేషన్‌లో ఏం జరుగుతోంది..ఏం జరగబోతోంది..?

అనంతపురం న్యూసిటీ: కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తిని అధికార పార్టీ నేతలు టార్గెట్‌ చేశారు. పొమ్మనలేక పొగబెడుతున్నారు. మూడ్రోజులకోసారి కమిషనర్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ప్రజాప్రతినిధి వర్గం తెర వెనుక డ్రామాలాడుతోంది. కమిషనర్‌ను సాగనంపుదామన్న విషయమై ఈ నెలలోనే రెండుసార్లు ఓ ప్రజాప్రతినిధి వర్గానికి చెందిన కార్పొరేటర్లంతా సమావేశం కావడం...      కమిషనర్‌ను బదిలీ చేస్తే పదవికి రాజీనామా చేస్తానంటూమేయర్‌ స్వరూప సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం.. పెద్ద చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి కమిషనర్‌ను బదిలీ చేయాలని ఓ వర్గం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి తీవ్ర మనస్థాపం చెంది సెలవులో వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వారిమాట వినకపోతే అంతే...
పాలకవర్గం అడుగులకు మడుగులొత్తే అధికారులే ‘అనంత’ పనిచేయగలరు. అధికార పార్టీ నేతలు చెప్పే ప్రతి దానికీ అధికారులు జీ హుజూర్‌ అనాల్సిన పరిస్థితి. అలా కానీ పక్షంలో ఏదో ఒక ఇబ్బంది కల్పించి వారికై వారే పారిపోయేలా చేస్తారు. ఇక ఓ ప్రజాప్రతినిధికి చెందిన వర్గమంటే అధికారులు హడలెత్తిపోతున్నారు. చిరుఉద్యోగి నుంచి కమిషనర్‌ వరకు వీరి మాట వినాల్సిందే. ఏదో సమస్యను చూపి సరెండర్‌ చేయాలని పట్టుబడతారు. గతేడాది ఫ్లెక్సీ విషయంలో సదరు ప్రజాప్రతినిధి వర్గీయులు ఏకంగా కార్పొరేషన్‌ అధికారులను తగలబెట్టాలని నోరుపారేసుకున్నారు. దీనికి తోడు కార్పొరేషన్‌లో కీలకమైన పదవిలో ఉన్న వారి చర్యలూ కమిషనర్లను ఇబ్బంది పెడుతున్నారు. వీరి ఆగడాలు భరించలేకే  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ పాలకవర్గం వచ్చినప్పటి నుంచి 12 మంది కమిషనర్లు మారిపోయారు. తాజాగా ఇపుడు పీవీవీఎస్‌ మూర్తి కూడా అదేబాట పట్టనున్నారు.

ప్రతిదానికీ అడ్డుపడుతున్నారనీ...
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎంతదొరికితే అంత వెనకేసుకోవాలన్నదే పాలకవర్గం ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఇపుడున్న కమిషన్‌కు బదిలీ చేయిస్తే.... 2015–16 తరహాలో ఇష్టానుసారంగా దొంగ బిల్లులు, డబుల్‌ బిల్లులు చేసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నది వారి ప్రణాళికా తెలుస్తోంది. అదే జరిగితే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే సమయానికి కార్పొరేషన్‌ ఖజానాలో పైసా లేకుండా చేసే ప్రమాదముంది.

కమిషనర్‌ మనస్థాపం
ఇటీవల జరుగుతున్న పరిణామాలతో కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. నగరాన్ని అభివృద్ధికోసం పనిచేస్తున్న తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెండు వర్గాల ఆధిపత్య పోరు భరించడం కన్నా సెలవులో వెళ్లిపోవడమే మేలని యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

ఒత్తిళ్లు లేవు
ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేవు. అయినా కొందరు ఫ్రీగా ఉండాలని భావిస్తుంటారు. మనం టైట్‌ చేశాం. నా పని నేను చేసుకుని వెళ్తా. ఇంకేముంది. ఏమీ లేదు.– పీవీవీఎస్‌ మూర్తి, కమిషనర్‌

రాజీనామాకు సిద్ధం
కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి వల్లే నగరపాలక సంస్థ గాడిలో పడింది. ఆయనొచ్చాకే చాలా మార్పులు జరిగాయి. ఇటీవల పలు పత్రికల్లో ఆయన్ను బదిలీ చేయాలని వార్తలొచ్చాయి. కమిషనర్‌ను బదిలీ చేస్తే రాజీనామాకైనా సిద్ధం. మంచి అధికారిని ఎలా వదులుకుంటాం.    – స్వరూప, మేయర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top