మొక్కలు నాటేందుకు బృహత్తర ప్రణాళిక | An ambitious plan natenduku plants | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటేందుకు బృహత్తర ప్రణాళిక

Oct 27 2014 1:43 AM | Updated on Sep 2 2017 3:25 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యవేక్షణలో నవంబర్ 10న మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడానికి మైక్రోప్లాన్ రూపొందిస్తున్నట్టు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ తెలిపారు.

డాబాగార్డెన్స్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యవేక్షణలో నవంబర్ 10న మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడానికి మైక్రోప్లాన్ రూపొందిస్తున్నట్టు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ తెలిపారు. జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్లో జీవీఎంసీ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, విశాఖ స్టీల్‌ప్లాంట్, కోరమండల్, రైల్వేలు, నేవీ, పలు సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆదివారం  మొక్క లు నాటే కార్యక్రమంపై ఆయన సమీక్షించారు.

వచ్చే నెల 10 నుంచి 30వరకు మొక్కలు నాటడానికి అందరి భాగస్వామ్యం, సహాయ సహకారాలతో ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. విశాఖను అందంగా, హరిత వనంలా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొక్కలే గాక ఇతర రాష్ట్రాల   అటవీశాఖ నుంచి సేకరిస్తున్నట్టు తెలిపారు.
 
మొక్కల సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

అటవీశాఖ వద్ద 50 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో నాలుగైదేళ్ల వయస్సు కలిగి, ఐదు మీటర్ల ఎత్తు పెరిగిన మొక్కలు వినియోగించనున్నట్టు వివరించారు. కడియం నర్సరీ, సీఎంఆర్ నర్సరీ, చిత్తూరు, కర్నూలు నర్సరీలో మూడు లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నందున వాటిని సేకరించి జీవీఎం సీ పరిధిలో నాటడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని రోడ్లకిరువైపులా, కాలనీ లు, ఇంటర్నల్ రోడ్లలో మొక్కలు నాటడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఆయా కాలనీలు, సంక్షేమ సంఘాలు స్వయం సహాయ సంఘాల సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని వాటి సంరక్షణకు ముందుకొచ్చి విజయవంతం చేయాలన్నారు. ప్రజలు, కాలనీ వాసులు మొక్కలను దత్తత తీసుకొని అవి పెరగడానికి సహకరించాలని కోరారు.
 
ట్రీగార్డుల ఏర్పాటు

నాటిన మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి, పశువుల బారిన పడకుం డా ఉండడానికి ట్రీగార్డుల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ట్రీగార్డులను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, వాటి ఏర్పాటుకు జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ బి.జయరామిరెడ్డి నివేదిక రూపొం దించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవనశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత విశాఖకు మొక్కల పెంపకం చేపడుతున్నట్టు తెలిపారు.
 
సమావేశంలో ఎమ్మె ల్సీ నన్నపనేని రాజకుమారి, సీడీఎంఏ డాక్టర వాణిమోహన్, జీవీఎంసీ కమిషనర్ ఎం.జానకీ, జీవీఎంసీ విభాగధిపతులు, జిల్లా అధికారులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ అధికారులు, వుడా, అటవీశాఖ సీసీఎస్ సూర్యనారాయణ, డీఎఫ్‌ఓ రామ్మోహన్, రెసిడెంట్స్ సంక్షేమ, అపార్టుమెంట్స్ సంక్షే మ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
రూ.25 లక్షల విలువైన ట్రీగార్డుల విరాళం
 
మంత్రి పిలుపునకు స్పందించి నార్త్ అమెరికా తెలుగు సంఘం, గౌతులచ్చన బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి వెంకన్న చౌదరి  మాస్ ప్లాంటేషన్ కార్యక్రమానికి తన వంతుగా రూ.25 లక్షల విలువ చేసే 400 ట్రీగార్డులను విరాళంగా అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement