కలెక్టర్ ఉత్తరువు..జనం చిత్తరువు | Allowed only if the identity card Collector office in Eluru | Sakshi
Sakshi News home page

కలెక్టర్ ఉత్తరువు..జనం చిత్తరువు

Feb 17 2014 2:20 AM | Updated on Sep 2 2017 3:46 AM

కలెక్టర్ ఉత్తరువు..జనం చిత్తరువు

కలెక్టర్ ఉత్తరువు..జనం చిత్తరువు

నలభై లక్షల మందికి పెద్ద దిక్కు.. ఏ కష్టమొచ్చినా నిరుపేద నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ ఆశ్రయించే న్యాయాలయం. నిత్యం వందలాదిమంది అధికారులు కార్యకలాపాలు సాగించే

సాక్షి, ఏలూరు:నలభై లక్షల మందికి పెద్ద దిక్కు.. ఏ కష్టమొచ్చినా నిరుపేద నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ ఆశ్రయించే న్యాయాలయం. నిత్యం వందలాదిమంది అధికారులు కార్యకలాపాలు సాగించే పరిపాలనా కేంద్రం జిల్లా కలెక్టరేట్. ఇన్నాళ్లూ ఎవరైనా ఇక్కడకు రావచ్చు. కానీ ఇక నుంచి ఆ అవకాశం లేదంటూ, గుర్తింపు కార్డు ఉంటేనే లోనికి అనుమతంటూ కలెక్టరేట్ గేటు ముందు రక్షక భటులు నిలువరిస్తున్నారు.  కలెక్టరేట్‌లో ప్రవేశానికి తొలిసారిగా వచ్చిన ఈ ఆంక్షలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇటీవల సమైక్యవాదులు జిల్లా కలెక్టరేట్ వద్ద సమైక్య నినాదాలు చేస్తుండగా కలెక్టర్ సిద్ధార్థజైన్ కారులో వచ్చారు. సమైక్యవాదులు కారుతో పాటే కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్లడం కలెక్టర్‌కు ఆగ్రహం తెప్పించింది.
 
 వెంటనే స్థానిక పోలీసును పిలిపించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. అంతటి అధికారి ఆదేశించడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. కలెక్టరేట్‌లో గేటును మూసేశారు. గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతిస్తామంటూ హుకుం జారీ చేశారు. ఓటు వేసేటప్పుడు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఫొటో ఉండే ఏదైనా గుర్తింపుకార్డు (రేషన్ కార్డు, బ్యాంక్‌బుక్, ఆధార్ కార్డు, పాన్‌కార్డు లాంటివి) తీసుకువస్తేనే ఓటు వేసే అవకాశం లభించినట్టు కలెక్టరేట్‌లోకి వెళ్లాలన్నా అలాంటి గుర్తింపుకార్డు తీసుకురావాల్సిందే. కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో పాటు, జాయింట్ కలెక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్, ఇతర ముఖ్య అధికారులతో పాటు, దాదాపు 30 ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది ఉంటారు. వీరిలో ఎవరిని కలవాలన్నా గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి వెళ్లేది. 
 
 సర్వత్రా విమర్శలు
 ఎన్నడూ లేని ఈ కొత్త విధానం వల్ల అధికారులను కలవాలంటే ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు. కనీస సమాచారం లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం గుర్తింపు కార్డులు లేకుండా వచ్చి గేటు వద్ద భంగపడుతున్నారు. కలెక్టరేట్‌లో పని చేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో చాలా మందికి గుర్తింపు కార్డులు లేవు. వారు విధులకు హాజరయ్యేందుకు వచ్చి గేటు వద్దే నిలిచిపోతున్నారు. ఇక సామాన్యుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. గుర్తింపు కార్డులేమీ లేకుండా జిల్లా నలుమూలల నుంచి వ్యయప్రయాసల కోర్చి వచ్చిన వారు   కనీసం ఆ కార్యాలయం గేటు దాటి వెళ్లలేకపోతున్నారు. భద్రత కోసం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారనుకున్నా మధ్యాహ్నం దాటాక గేట్లు తెరుస్తున్నారు. అప్పుడు మాత్రం ఎందుకో ఈ భద్రత కనిపించడం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు మధ్యాహ్నం లోపు తమ గోడును చెప్పుకుని వెనుదిరగకపోతే ఊరికి చేరలేరు. కానీ మధ్యాహ్నం దాటాక గేట్లు తెరిస్తే ఎప్పుడు అధికారులను కలుస్తారు. ఇళ్లకు ఎప్పుడు బయలుదేరతారు. సామాన్యుల్ని చేరదీయాల్సిన కలెక్టర్ ఇలా దూరం పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రత కోసమే అయితే పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయని, ఇలా గుర్తింపు కార్డు విధానం పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడటం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement