రెవెన్యూలో అవినీతి జలగలు.!

Allegations of corruption In Revenue Office At kazipet, kadapa - Sakshi

సాక్షి, ఖాజీపేట(కడప) : ఖాజీపేట మండలంలో గత 20 ఏళ్లుగా కొందరు వీఆర్‌ఓలు రెవెన్యూ గ్రామాలు మారుతూ ఇక్కడే తిష్ట వేశారు. దీంతో వచ్చిన తహసీల్దార్లను మచ్చిక చేసుకుని అంతా తామై నడిపిస్తున్నారు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించారు. దాని ప్రకారం రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ముట్టజెప్పిన రైతులు నెలల తరబడి వారి చుట్టూ తిరిగినా పనులు జరగడం లేదు. 

పనులు చేయిస్తామని భారీగా వసూళ్లు
ఖాజీపేట మండలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్‌ పార్వతితో పాటు  వీఆర్‌ఓ శ్రీనివాసులరెడ్డి మరికొందరు వీఆర్‌ఓలు భూ సమస్యలు పరిష్కరిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా తుడుమలదిన్నె, తిమ్మారెడ్డిపల్లె, సన్నపల్లె, పుల్లూరు తదితర గ్రామాల్లో అధికంగా వీఆర్‌ఓల బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చుక్కల భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన ప్రతి రైతు నుంచి వారి అవసరాన్ని బట్టి రూ.10 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేశారని రైతుల ఆరోపణ.

అలాగే ఆన్‌లైన్‌ నమోదు, పాసుపుస్తకాల కోసం, డీకేటీ పట్టా పొందిన రైతుల భూముల ఆన్‌లైన్‌ పేరుమార్పు, ఇతరుల పేరుతో ఉన్న ఆన్‌లైన్‌ను తొలగించి తిరిగి భూమి కలిగిన రైతు పేరున మార్చేందుకు ఇలా అనేక రైతుల సమస్యలకు రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. తహసీల్దార్‌ పార్వతితో పాటు వీఆర్‌ఓ శ్రీనివాసులరెడ్డి తదితరులు డబ్బులు గుంజారు.

బదిలీపై అధికారులు
ఖాజీపేట మండలంలో తహసీల్దార్‌ గా పనిచేసిన పార్వతి తోపాటు వీఆర్‌ఓ  శ్రీనివాసులరెడ్డి బదిలీ అయ్యారు. వీరు రైతుల నుంచి  పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసి పనులు చేయకుండా తిరిగి రైతులకు డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పనులు చేయలేదు, కనీసం తమ డబ్బయినా తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అయినా వీఆర్‌ఓలు పట్టించుకోక పోవడంతో సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 

తీరు మారదంతే..
ఖాజీపేట రెవెన్యూ కార్యాలయంలోని అధికారుల తీరు ఎంత చేసినా మారడంలేదు. గతంలో పనిచేసిన తహసీల్దార్‌ శివరామయ్య దొంగ పట్టాలు ఇచ్చారు. ఆన్‌లైన్‌లో ఒకరికి తెలియకుండా ఒకరి భూముల పేర్లు మార్చారు. ఇలా అనేక అవకతవకలకు పాల్పడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేశారు.  అలాగే గతంలో పనిచేసిన అధికారుల్లో  తహసీల్దార్‌ కృష్ణయ్య తోపాటు ఆర్‌ఐ రాధాకృష్ణ, వీర్‌ఓలు, సర్వేయర్‌ ఏసీబీకి దొరికారు. మరో వీఆర్‌ఓ చెన్నూరు మండలానికి వెళ్లి అక్కడ ఇసుక ట్రాక్టర్ల దగ్గర డబ్బు వసూలు చేస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసి సస్పెండ్‌  చేశారు.  

సా...గుతున్న విచారణ
 వీఆర్‌ఓల అక్రమాలపై అప్పటి కలెక్టర్‌ బాబూరావు నాయుడుకు 2018లోనే రైతులు ఫిర్యాదు చేశారు. ఆమేరకు విచారణ అధికారిగా ప్రత్యేక కలెక్టర్‌ రోహిణిని నియమించారు. విచారణ అధికారికి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున రాతపూర్యకంగా ఫిర్యాదులు ఇచ్చారు.  అయితే విచారణకు కావాల్సిన రికార్డులు ఇచ్చేందుకు  తహసీల్దార్‌ పార్వతి సహకరించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రికార్డులు ఇవ్వని కారణంగా నివేదిక ఆలస్యం
విచారణకు వచ్చిన నాకు ఖాజీపేట తహసీల్దార్‌ రికార్డులు ఇవ్వలేదు. 95 రికార్డులు అడిగితే 60 రికార్డులు మాత్రమే ఇచ్చారు. మిగిలినవి ఉన్నాయో లేదో తెలియదు. లేక పోతే మా వద్ద లేవు అని రాతపూర్వకంగా ఇవ్వాలని తహసీల్దార్‌ను అడిగాను. ఇదే విషయమై అనేక నోటీసులు ఇచ్చినా తహసీల్దార్‌ స్పందించ లేదు. అసంపూర్తిగా నివేదిక ఇవ్వలేం. తహసీల్దార్‌ రాతపూర్వకంగా ఇస్తే కలెక్టర్‌కు నివేదిస్తాను. 
– రోహిణి, ప్రత్యేక కలెక్టర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top