'కోవిడ్‌'పై వదంతుల్ని నమ్మవద్దు

Alla Nani Says That No Coronavirus in AP - Sakshi

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

మాస్క్‌లు అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు 

త్వరలో ప్రభుత్వాసుపత్రుల్లోనూ టెస్టింగ్‌ ల్యాబ్స్‌

సాక్షి, అమరావతి/కాకినాడ సిటీ/పెదవాల్తేరు/తిరుపతి తుడా: రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కోవిడ్‌–19 (కరోనా) కేసు కూడా నమోదు కాలేదని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) స్పష్టం చేశారు. ఈ వైరస్‌కు సంబంధించి మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

20 మందికి నెగెటివ్‌ వచ్చింది 
రాష్ట్రంలో ఇప్పటివరకు 24 అనుమానిత కేసులు నమోదు కాగా.. వారిలో 20 మందికి కోవిడ్‌ సోకలేదని తేలింది. మిగిలిన నలుగురినీ అనుమానితులుగానే భావిస్తున్నారు. 
- కోవిడ్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కూడా వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల అధికారులతో మూడు గంటలకు పైగా సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలిచ్చారు
- మాస్క్‌లను బ్లాక్‌  మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు
- ఇప్పటికే ఒంగోలులో రెండు షాపులపై కేసుల నమోదు
- తగినన్ని మందులు, మాస్కులు అందుబాటులో ఉన్నాయి

ప్రభుత్వ కార్యదర్శులు ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పీవీ రమేష్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ..
- ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు తప్పనిసరిగా వైద్య, ఆరోగ్య శాఖకు వివరాలివ్వాలి
- అనుమానితులు 104 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి సమాచారం పొందవచ్చు. 
- చేతులు కడుక్కోవడం, ముఖానికి మాస్క్‌లు ధరించడం, ఎస్కలేటర్, తలుపులు, బల్లలపై చేతులు వేయకుండా ఉండటం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి 
- ఇప్పటివరకు 351 మందిని కోవిడ్‌ వైరస్‌ అనుమానంతో పరిశీలనలో ఉంచాం
- ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల చేస్తున్నాం. అందుబాటులో 1.10 లక్షల ఎన్‌–95 మాస్కులున్నాయి.
- 20 వేల మెడికల్‌ షాపుల్లో సాధారణ మాస్కుల్ని ఉచితంగా అందుబాటులో ఉంచాం.

వారిని డిశ్చార్జ్‌ చేశాం
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు కోవిడ్‌ వైరస్‌ లేదని వైరాలజీ ల్యాబ్‌ నివేదికల్లో తేలిందని కాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం అతడిని స్వస్థలానికి పంపించామన్నారువిశాఖలోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రిలో చేరిన ఐదుగురికి కోవిడ్‌ లేదని, గాంధీ ఆస్పత్రి నుంచి వారి ల్యాబ్‌ రిపోర్టులు వచ్చాయని నోడల్‌ అధికారి డాక్టర్‌ పార్థసారథి తెలిపారు. వీరిని శుక్రవారం డిశ్చార్జి చేశామన్నారు. (ఆందోళన వద్దు.. అప్రమత్తం కావాలి)

స్విమ్స్‌లో నిర్ధారణ కేంద్రం
- తిరుపతిలోని స్విమ్స్‌లో కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు
- వైరల్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నొస్టిక్‌ లేబరేటరీస్‌ కేంద్రాన్ని రాష్ట్రస్థాయిలో నోడల్‌ కేంద్రంగా శుక్రవారం అందుబాటులోకి తెచ్చారు
- పూణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నుంచి స్విమ్స్‌కు కోవిడ్‌–19 వ్యాధి నిర్ధారణ కిట్‌లను పంపించారు
- 6 పడకలతో కూడిన ఐసొలేషన్‌ ఐసీయూ వార్డును సిద్ధం చేశారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top