నందికొట్కూరులో లిల్లీపుట్స్ | Aliens visiting on earth | Sakshi
Sakshi News home page

నందికొట్కూరులో లిల్లీపుట్స్

Oct 29 2013 1:59 AM | Updated on Sep 2 2017 12:04 AM

బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్ నటించిన సినిమా ‘కోయి మిల్ గయా’ లాంటి కథ నందికొట్కూరులో నడిచింది. ఈ సినిమాలో ఒక పిల్ల గ్రహాంతర జీవి తప్పిపోయి భూమిపైకి చేరుతుంది.

కర్నూలు(విద్య)/నందికొట్కూరుటౌన్, న్యూస్‌లైన్:బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్ నటించిన సినిమా ‘కోయి మిల్ గయా’ లాంటి కథ నందికొట్కూరులో నడిచింది. ఈ సినిమాలో ఒక పిల్ల గ్రహాంతర జీవి తప్పిపోయి భూమిపైకి చేరుతుంది. ఆ జీవి బుద్ధిమాంద్యం కలిగిన హీరో హృతిక్‌రోషన్‌కు కనిపిస్తుంది. దానిని అతను ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టి, ప్రతిరోజూ ఆడుకుంటాడు. తనతో పాటు స్నేహితులకూ చూపి కలిసి ఆడుకుని తద్వారా అపారశక్తిని సంపాదిస్తాడు. భైరవద్వీపం సినిమాలోని ఒక పాటలో బాలకృష్ణ పైకి పది అంగుళాలు ఉండే లిల్లీపుట్(మరుగుజ్జు)లు ఎక్కి, దిగడం చేస్తుంటారు. ఇలాంటి జీవులు, లిల్లీపుట్ లాంటి పది అంగుళాల మనుషులు అక్కడి చిన్నారులకు కనిపించారట.
 
 ఈ ప్రచారం ఊరంతా పాకడంతో అక్కడ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు హడావుడి ఏర్పడింది. గ్రహాంతర వాసులు కనిపించారంటూ నగరంలో విస్తృతంగా ప్రచారం జరగడంతో జనంలో ఒకింత ఆశ్చర్యం, మరికొంత భయాందోళన నెలకొంది. నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ రోడ్డులోని శ్రీ వాణి  స్కూల్‌కు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాల వెనుకవైపు ముళ్లకంప వద్దకు మూత్రవిసర్జనకు వెళ్లారు. అదే సమయంలో పది అంగుళాల ఎత్తు ఉండే వింత జీవులు వారికి కనిపించాయట. విద్యార్థులను చూసి అవి పక్కనే ఉన్న పాఠశాల ప్రహరీ సందుల్లోకి వెళ్లిపోయాయట. వెంటనే ఆ పిల్లలు ఘటనను పాఠశాల ఉపాధ్యాయులకు వివరించారు. ఉపాధ్యాయులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. వారు చెప్పిన తీరుపై నమ్మకం కలగడంతో పాఠశాల యాజమాన్యానికి, పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు సమాచారమందించారు.
 
 అంతే.. నందికొట్కూరుకు గ్రహాంతర వాసులు వచ్చారన్న వార్త నిమిషాల్లో దావానలంలా పాకింది.
 సాయంత్రం 6 గంటల సమయానికి ఆ ప్రాంతంలో వందల మంది గుమిగూడారు. కొందరు యువకులు ఒకింత సాహసం చేసి విద్యార్థులు చెప్పిన చోటుకు వెళ్లి పరిశీలించారు. గోడలో ఏమైనా గ్రహాంతర వాసులు దాక్కున్నారేమోనని ఒక్కో రాయిని మెల్లగా కదిలించి చూశారు. ఇలా కొందరు యువకులు రావడం.. రాళ్లను కదిలించిఏమీ లేదని చెప్పడం, మరికొందరు రావడం ఇంకొన్ని రాళ్లను పెకిలించడం రాత్రి వరకు జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు ఆ ప్రాంతానికి నందికొట్కూరులోని ప్రజలు వస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన సినిమాలు పిల్లలు చూసి, వాటి గురించే ఆలోచించడం వల్ల ఇలాంటి భ్రమలు కలుగుతుంటాయని స్థానికులు చర్చించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement