సరిహద్దు నుంచి యథేచ్ఛగా మద్యం.. | Alcohol Smuggling From Other States to AP | Sakshi
Sakshi News home page

సరిహద్దు నుంచి యథేచ్ఛగా మద్యం..

Oct 14 2019 1:24 PM | Updated on Oct 14 2019 1:24 PM

Alcohol Smuggling From Other States to AP - Sakshi

అక్రమ మద్యం రాష్ట్ర సరిహద్దులు దాటి వస్తోంది. ఏపీ సరిహద్దున ఉన్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి నిత్యం మద్యం రాష్ట్రంలోని గ్రామాలకు సరఫరా అవుతోంది. ఎక్సైజ్‌ శాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో ఎటపాక మండలంలోకి మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దాంతో గ్రామాల్లోని చిన్న చిన్న కిరాణా షాపుల్లో సైతం విచ్చలవిడిగా తెలంగాణ మద్యం విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలోని భద్రాచలం పట్టణం ఎటపాక మండలంతో కలిసే ఉంటుంది. ఎటపాక మండల ప్రజలు ఏది కొనాలన్నా నిత్యం భద్రాచలంలోని షాపుల్లోనే కొనుగోలు చేస్తుంటారు. ఇదే తరహాలో మద్యం బాటిళ్లను కూడా తెలంగాణ నుంచే తెచ్చి ఇక్కడ జోరుగా విక్రయిస్తున్నారు.

తూర్పుగోదావరి ,నెల్లిపాక (రంపచోడవరం): దశల వారీ మద్య నిషేధంపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలను కట్టడి చేశారు. గ్రామాల్లో బెల్టు షాపులు ఎత్తివేయటమే గాకుండా మద్యం షాపులను ప్రభుత్వమే నడుతోంది. దీంతో అక్కడి షాపుల్లో మద్యం గ్రామాలకు సరఫరా కావటం లేదు. దీంతో గ్రామాల్లో మద్యం వ్యాపారులు మండలం సరిహద్దునే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఉండటంతో అక్కడి మద్యం సరిహద్దులను దాటించి తెస్తున్నారు. అలా తెచ్చిన మద్యంను గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లోని పలుషాపుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ఈ విధంగా మన రాష్ట్ర ఆదాయానికి కూడా గండి కొడుతున్నారు. ఎటపాక మండల కేంద్రంతో భద్రాచలం పట్టణం కలిసి ఉండడంతో మద్యం,  సారా తయారీకి వాడే నల్లబెల్లం, పటికను ఏపీలోకి తరలించటం సులభం అవుతోంది. అదేవిధంగా లక్ష్మీపురం సమీపంలోనే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దు అటు తెలంగాణలోని దుమ్ముగూడెం మండల సరిహద్దు ఉండటంతో ఇరు రాష్ట్రాల నుండి కూడా మద్యం ఏపీకి తరలిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి నకిలీ మద్యం కూడా రాష్ట్రంలోకి చేరవేస్తున్నుట్లు సమాచారం.

చెక్‌పోస్టులు లేకపోవడంతో..
పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం ఏపీకి తరలిస్తుండటానికి ఇక్కడ సరిహద్దుల్లో ఎక్సైజ్‌ శాఖ చెక్‌పోస్టులు లేకపోవడమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. నిత్యం ఆటోలు, ద్విచక్ర వాహనాలు, టాటా మ్యాజిక్‌ తదితర వాహనాల్లో భద్రాచలం నుంచి ఎటపాక మండలానికి మద్యం రవాణా చేస్తున్నారు. కొందరు ఆటోల్లో మద్యం బాటిళ్లను ఇక్కడి దుకాణాలకు విక్రయిస్తూ ఒక్కో బాటిలుకు రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మద్యపానం నిషేధించాలనే ఉద్దేశంతో మహిళలు, యువకులు ఇటీవల పలు గ్రామాల్లో మద్యం షాపులపై దాడులు కూడా చేశారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో మద్యం, సారా అమ్మకాలు 80 శాతం తగ్గాయి. మిగతా గ్రామాల్లో తెలంగాణ నుంచి తెచ్చిన మద్యం విక్రయిస్తుండడంతో ఎక్సైజ్‌ శాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో ఎక్సైజ్‌ దాడులు చేసి మద్యం, సారా అమ్మకాల వ్యాపారులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ముడుపులు తీసుకుని వదిలిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వ్యాపారులు యథేచ్ఛగా సారా, మద్యం అమ్ముతున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎక్సైజ్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాల మద్యం ఏపీలోకి రాకుండా నియంత్రించాలని మహిళలు
కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement