ఎక్సైజ్ కార్యాలయంలోనే లెసైన్స్‌దారులకు మద్యాన్ని అధికారులు సరఫరా చేశారు.
కర్నూలు : ఎక్సైజ్ కార్యాలయంలోనే లెసైన్స్‌దారులకు మద్యాన్ని అధికారులు సరఫరా చేశారు. సుందరయ్య సర్కిల్ సమీపంలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ప్రభుత్వ మద్యం గోడౌన్‌ను ప్రారంభించినప్పటికీ అక్కడ సరైన సౌకర్యం లేకపోవడంతో శుక్రవారం రాత్రి ఎక్సైజ్ కార్యాలయ ఆవరణంలోనే లారీలను నిలిపి లెసైన్స్‌దారులకు అవసరమైన మద్యాన్ని సరఫరా చేశారు.
కార్పొరేట్ పన్ను చెల్లించనందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కల్లూరు శివారులోని హంద్రీ నది ఒడ్డున ఉన్న మద్యం డిపోను కూడా ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఫలితంగా ఈనెల 5వ తేదీ నుంచి మద్యం దుకాణాలను సరఫరా నిలిచిపోయింది. కమిషనర్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా హోల్‌సేల్ ఐఎంఎల్ డిపో ప్రారంభించినప్పటికీ హమాలీల మధ్య పోటీ నెలకొనడంతో రెండు రోజులుగా సరఫరా నిలిచిపోయింది.
హమాలీల మధ్య వివాదం
17 ట్రక్కుల మద్యం గోడౌన్‌కు వచ్చినప్పటికీ వాటిని దించే విషయంలో హమాలీల మధ్య వివాదం తలెత్తి పగలంతా సరఫరా ఆగిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ హమాలీలు అడ్డుకోవడంతో సమస్య జటిలమైంది. పాత ఐఎంఎల్ డిపో దగ్గర పనిచేసిన హమాలీలు ఎక్సైజ్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
ఎక్సైజ్ కార్యాలయం తమ ప్రాంతంలో ఉన్నందున తామే పనిచేస్తామంటూ పాతబస్టాండ్ ప్రాంత హమాలీలు అక్కడికి చేరుకున్నారు . దీంతో ఇరువర్గాల మధ్య సమస్య జఠిలం కావడంతో డీఎస్పీ రమణమూర్తి, సీఐ ములకన్న, ఎక్సైజ్ అధికారులు హమాలీలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఒకవైపు ఐఎన్‌టీయూసీ నాయకులు రమణ, మరోవైపు సీఐటీయూ నాయకులు రాజగోపాల్ హమాలీల తరపున అధికారులతో చర్చలు జరిపినప్పటికీ ఫలించలేదు.
ఇన్‌చార్జి డిప్యుటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, సూపరింటెండెంట్ సూర్జిత్ సింగ్ తదితరులు కూడా చర్చలు జరిపారు. అయినప్పటికీ హమాలీల మధ్య అవగాహన కుదరకపోవడంతో సాయంత్రం ఇరువర్గాలను జాయింట్ కలెక్టర్ వద్ద హాజరుపరిచారు. ప్రస్తుతం 17 ట్రక్కులకు సంబంధించిన మద్యాన్ని రెండు గ్రూపులకు సంబంధించిన హమాలీలు అన్‌లోడ్ చేయాలని, ఆ తర్వాత ఎఫ్‌సీఐ గోదాము దగ్గర జరిగే లావాదేవీలు అక్కడ ఉన్న హమాలీలు పనిచేసే విధంగా ఒప్పందం కుదిరించడంతో రాత్రి 9 గంటల సమయంలో దుకాణాైలకు మద్యాన్ని సరఫరా చేశారు.