
తిరువనంతపురం: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం మాయమైన ఉదంతంలో దర్యాప్తు చేపట్టేందుకు అధికారులు మంగళవారం శబరిమల చేరుకున్నారు. దేవస్వం విజిలెన్స్ పర్యవేక్షణలో, ఆలయంలోని స్ట్రాంగ్ రూమ్ తెరిచి తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ పరిణామాలపై చర్చించేందుకు దేవస్వం బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించనుంది.
శబరిమల ఆలయంలో బంగారు పూత, ద్వారపాలక విగ్రహాల పీఠం అదృశ్యంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేరళ మంత్రి వీఎన్ వాసవన్ స్పష్టం చేశారు. “శబరిమల అభివృద్ధిని నిర్ధారించడం, భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచడంలోనే ప్రభుత్వం పాత్ర ఉంటుందన్నారు. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఈ వివాదంలో ఇరికించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తోందని’ ఆయన ఆరోపించారు.
గతంలో సువర్ణ దాత ఉన్నికృష్ణన్ పొట్టి.. కనిపించకుండా పోయిందని పేర్కొన్న ద్వారపాలక శిలాపీఠం అతని సోదరి ఇంట్లో దొరికిందని తెలుస్తోంది. దీంతో పొట్టి ఫిర్యాదు వెనుక కుట్ర ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ బంగారు వస్తువు 2019లో కనిపించకుండా పోయింది. ఇటీవలే దేవస్వం విజిలెన్స్ బృందం దానిని స్వాధీనం చేసుకుంది. అయితే ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరించి, ప్రస్తుత పరిస్థితి గురించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
ప్రతిపక్ష సభ్యులు గతంలో దాదాపు నాలుగు కిలోగ్రాముల బంగారాన్ని తొలగించారని అసెంబ్లీలో ఆరోపించారు. కాగా 1998లో విజయ్ మాల్యా విరాళంగా ఇచ్చిన బంగారాన్ని ప్రజా పనుల శాఖ అధికారులు తూకం వేసి, డాక్యుమెంట్ చేశారని రికార్డులు చూపిస్తున్నాయి. కోర్టు ఆదేశం మేరకు దేవస్వం అధికారులు ఆ పనిని చేపట్టారు. ఈ నేపధ్యంలో 1998 నుండి జరిగిన అన్ని కార్యకలాపాలను దర్యాప్తులో చేర్చాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు.