‘అర్హులైన రైతులందరికీ భరోసా’

Agriculture Minister Kannababu Clarifies On Raitu Bharosa - Sakshi

కాకినాడ : అక్టోబర్ 15న రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలుస్తుందని వ్యవసాయ మంత్రి కన్నబాబు అన్నారు.  రైతులను కనీవిని ఎరుగని రీతిలో ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు.దేశంలోనే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పధకం ఓ సంచలనం కాబోతోందని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఇస్తామన్న హామీని ముందుగానే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో సిఎం జగన్ రైతు భరోసా పధకాన్ని ప్రారంభిస్తున్నారని, రైతు అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్, రైతులకు ఉచిత విద్యుత్ అంటే చంద్రబాబు హేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. మంత్రి కన్నబాబు ఆదివారం కాకినాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సిఎం జగన్ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ యోజనతో అనుసంధానం చేసి వైఎస్ఆర్ రైతు భరోసా అమలు చేస్తున్నామని ఇందులో ఎలాంటి దాపరికం లేదని తేల్చిచెప్పారు.

రైతు భరోసాపై టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు ఆ పార్టీ నేత ధూళిపాళ నరేంద్ర వరకు లేనిపోని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రూ. 84 వేలకోట్లు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు.. రూ.24 వేలకోట్లకు కుదించారని చివరికి రూ. 15 వేల కోట్లు రుణమాఫి చేయడానికి తీసుకున్న రుణాలను కూడా దారి మళ్లించారని మంత్రి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. 7 లక్షల మంది కొత్త రైతులు  రైతు భరోసాలో పేర్లు నమోదు చేసుకున్నారని, పిఎం కిసాన్ యోజన పధకంలో అర్హత లేని పేర్లు నమోదయ్యాయని అవి చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చినవేనని అన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా సాయం అందాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని స్పష్టం చేశారు. రైతు నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, అర్హతలేని కొందరి పేర్లు నమోదయినట్టు గుర్తించామని చెప్పారు. అలాగే కొందరు మృతి చెందిన రైతుల పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయరని, వాటిని అన్నింటిని పరిశీలించి వైఎస్ఆర్ రైతు భరోసా పధకాన్ని అందిస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top