విజిటింగ్‌ వీసాతో ఏజెంట్‌ మోసం

Agent Cheat Narasapuram Youth Visiting Visa To Malaysia - Sakshi

మలేషియాలో 97 రోజులు జైల్లో గడిపిన నరసాపురం యువకులు

వేడుకున్నా ఎవరూ ఆదుకోలేదని ఆవేదన

మలేషియా జైలు నుంచి నరసాపురం చేరుకున్న బాధితులు

నరసాపురం : మలేషియాలోని కంపెనీలో ఉద్యోగాలంటూ ఓ ఏజెంట్‌ నరసాపురం పట్టణానికి చెందిన నలుగురు యువకులకు వల వేశాడు. ఆ యువకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మలేషియా పంపాడు. విజిటింగ్‌ విసాపై వారిని మలేషియా పంపి ఏజెంట్‌ మోసం చేశాడు. వారిని మలేషియా పోలీసులు అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. 97 రోజుల పాటు ఆ యువకులు అక్కడ నరకం అనుభవించారు. ఎట్టకేలకు వారి బంధువులు చేసిన ప్రయత్నాలు ఫలించి స్వదేశానికి వచ్చారు. శుక్రవారం ఉదయం సొంతూరుకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన యర్రంశెట్టి సంతోష్‌ కుమార్, కొమ్మిన ప్రవీణ్‌బాబు, వేగి కిరణ్‌కుమార్, మొగల్తూరుకు చెందిన కొత్త చిట్టిబాబులను మలేషియాలో ఉద్యోగాలు ఉన్నాయంటూ నరసాపురం పట్టణానికి చెందిన కొప్పినీడి స్వామినాయుడు నమ్మించాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.1.75 లక్షలు వసూలు చేసి గతేడాది నవంబర్‌లో మలేషియా తీసుకెళ్లాడు. వీసాలు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇస్తానని ఏజెంట్‌ చెప్పడంతో అది నమ్మిన యువకులు నిబంధనలు తెలుసుకోకుండా మలేషియా వెళ్లారు. 3 నెలల విజిటింగ్‌ వీసా మీద తీసుకెళ్లినట్టుగా అక్కడికి వెళ్లాక వీరికి తెలిసింది. ముందు ఓ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 6న వీరిని అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు.

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
తమ వారు జైల్లో ఉన్నారని తెలిసిన కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సహా పలువురు అధికారులను కలిశారు. మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకపోయింది. వారెవరూ పట్టించుకోలేదు. జైల్లో అక్కడి పోలీసులు దారుణంగా కొట్టడంతో ఆరోగ్యాలు కూడా క్షీణించాయి. పోలీసులను బతిమాలి ఫోన్‌ తీసుకుని ఎన్నిసార్లు మాట్లాడినా ఆ దేశంలోనే ఉన్న ఏజెంట్‌ కనికరించలేదని యువకులు వాపోయారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో టికెట్‌లు తీయించి పంపితే స్వదేశానికి పంపిస్తామని పోలీసులు ఒప్పుకున్నారు. దీంతో కుటుంబసభ్యులు విమానం టికెట్‌లు తీయించి పంపించారు. ఈనెల 11న వారిని అక్కడి పోలీసులు విడుదల చేసి విమానం ఎక్కించారు. వారు శుక్రవారం నరసాపురం చేరుకున్నారు. యర్రంశెట్టి సంతోష్‌ కుమార్, కొమ్మిన ప్రవీణ్‌బాబు, వేగి కిరణ్‌కుమార్‌ నరసాపురం చేరుకోగా మరో యువకుడు కొత్త చిట్టిబాబు ఆరోగ్యం క్షీణించడంతో బంధువులు భీమవరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు.  ఏజెంట్‌ కొప్పినీడి స్వామినాయుడుపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు యువకులు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top