సింగపూర్– మలేసియాలు ట్విన్ కంట్రీస్ కాదు... కానీ టూరిజం ప్రధానంగా కవలల్లాగ సరిపోలి ఉంటాయి.ఇండియా నుంచి టూర్ ప్యాకేజ్‌లు కలగలిసి ఉంటాయి.ఈ టూర్‌లో ఏమేమి చూడవచ్చు... అంటే లిస్ట్ పెద్దదే.మలేసియాలో... ఒక ఇండిపెండెన్స్ స్క్వేర్... మరో నేషనల్ మాన్యుమెంట్. కింగ్స్ ప్యాలెస్ ఇస్తానా నెగారా...తళతళ మెరిసే ట్విన్ టవర్స్.కుమారస్వామి కొలువైన బటూకేవ్స్...ప్రధాని కొలువైన పుత్రజయ.
సింగపూర్‌కి వస్తే...
దేశ చిహ్నం మెర్‌లయన్ పార్క్... సంతోషాల హరివిల్లు సెంటోసా.హైబ్రీడ్ పూల ఆర్చిడ్ గార్డెన్... కోట్లాది వీక్షకుల యూనివర్సల్ స్టూడియోస్.స్టార్ ఇమేజ్‌ల మేడమ్ టుస్సాడ్స్... పక్షుల నిలయం బర్డ్ ప్యాడైజ్. ఒకసారి దుస్తులు సర్దుకుంటే... ఆరు రోజుల్లో రెండుదేశాలు తిరిగి రావచ్చు.
జీరో డే: సాయంత్రం 19.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ లో టూర్ ఆపరేటర్‌లకు రిపోర్ట్ చేయాలి. పర్యాటకులకు స్వాగతం పలకడం, ఎయిర్‌పోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం, విమానం ఎక్కడం. విమానం రాత్రి 11.10కి బయలు దేరుతుంది. తొలిరోజు ప్రయాణం సాగుతుంది. కానీ పర్యటన ఏమీ ఉండదు. కాబట్టి ఈ టూర్ ఐటెనరీలో తొలిరోజును జీరో డే గా గుర్తిస్తారు. రెండవ రోజును ఐటెనరీ తొలిరోజుగా గుర్తిస్తారు.
ఫస్ట్ డే: ఉదయం 8.10 గంటలకు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో దిగడం. లగేజ్ తీసుకుని, ఎయిర్‌పోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. ఎయిర్‌పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర టూర్ ఆపరేటర్‌లు రిసీవ్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. గదిలో చెక్ ఇన్, రిఫ్రెష్‌మెంట్ తర్వాత విశ్రాంతి, మధ్యాహ్న భోజనం తర్వాత సైట్ సీయింగ్. ఫొటో స్టాప్ ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్, చాకొలేట్ హోల్‌సేల్ షాప్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి హోటల్‌కు చేరడం. రాత్రి బస కౌలాలంపూర్.
స్వాతంత్య్రవేడుకల నేల
ఇండిపెండెన్స్ స్క్వేర్ అనేది మలేసియా దేశ గర్వకారణం. బ్రిటిష్ పాలన నుంచి మలేసియా విముక్తి పొందిన రోజు అంటే... 1957, ఆగస్టు 31వ తేదీన యునైటెడ్ కింగ్‌డమ్ పతాకాన్ని అవనతం చేసి అదే స్థానంలో మలేసియా పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి దీనికి ఇండిపెండెన్స్ స్క్వేర్ అనే పేరు వచ్చింది. ఏటా ఆ దేశ స్వాతంత్య్రదినోత్సవరం రోజున ఇక్కడే జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది.
రాజప్రాసాదం
కౌలాలంపూర్‌లో రాజప్రాసాదం పేరు ఇస్తానా నెగారా. ఈ కింగ్స్ ప్యాలెస్ ఉన్న ప్రదేశం జలన్ ఇస్తానా. 13 ఎకరాల్లో విస్తరించిన ప్యాలెస్ ఇది. రాజు నివసిస్తాడు. ఈ ప్యాలెస్‌ది పల్లడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్. రాజురాణి ప్రజలకు దర్శనమిస్తే హాల్‌లో సింహాసనాలు రెండు ఉంటాయి. ఇక్కడి పదాలు భారతీయతకు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తాయి. సింహాసనానన్ని సింగాహ్సన అంటారు. నేషనల్ మాన్యుమెంట్ దేశభక్తికి ప్రతీక. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో దేశం స్వాతంత్య్రం కోసం ΄ోరాడిన సైనికుల గౌరవార్థం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ప్రపంచ రికార్డు ఉంది. వరల్డ్స్ టాలెస్ట బ్రాంజ్ ఫ్రీ స్టాండింగ్ స్కల్ప్చర్ ఇది.
నాటి రికార్డ్ టవర్స్
స్టీల్, గ్లాస్‌తో నిర్మించిన పెట్రోనాస్ ట్విన్ టవర్స్ తళతళలాడుతూ కౌలాలంపూర్ నలుమూలలకూ కనిపిస్తుంటాయి. 88 అంతస్థుల నిర్మాణం. 86వ అంతస్థులో అబ్జర్వేటరీ డెక్ ఉంది. ఇక్కడికి పర్యాటకులను అనుమతిస్తారు. మలేసియాలోని ప్రధాన వ్యా΄ార సంస్థల కార్యాలయాలు ఇందులోనే ఉన్నాయి. వీటిని 1998లో నిర్మించారు. నిర్మించినప్పటి నుంచి 2004 వరకు వరల్డ్ టాలెస్ట్ టవర్స్ అనే భుజకీర్తిని ధరించాయి. దీని నిర్మాణానికి మోడల్ స్ట్రక్చర్ మనదేశ రాజధాని ఢిల్లీలోని కుతుబ్ మినారే. సెకండ్ డే: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బటూ కేవ్స్‌కు ప్రయాణం. బటూ కేవ్స్ విహారం తర్వాత గెంటింగ్ హైలాండ్స్ సందర్శనం. తిరిగి కౌలాలంపూర్‌కి చేరి ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ తర్వాత బస చేసిన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి బస అక్కడే.
మలేసియా కుమారస్వామి
మలేసియాలో బటూ కేవ్స్ పరిసరాల్లోకి వెళ్లగానే తమిళం వినిపిస్తుంది. మనదేశంలో తమిళనాడులో అడుగుపెట్టినట్లు ఉంటుంది. మురుగా అని తరచూ వినిపిస్తూంటుంది. ఇక్కడున్న మురుగన్ ఎత్తు 140 అడుగులు. బంగారు వర్ణంలో మెరిసి΄ోతూ ఉంటాడు. మనం కుమారస్వామిగా పిలిచే దైవమే మురుగన్. కుమారస్వామిని గుండెల్లో పెట్టుకుని కొలిచే తమిళులు ఇక్కడ ఆకాశమంత రూపాన్నిచ్చారు. ఇరవై ఏళ్ల కిందట దాదాపు 20 కోట్లు ఖర్చయింది.
గాంబ్లింగ్ హైల్యాండ్స్
గెంటింగ్ హైల్యాండ్స్ అనేది మలేసియాలో ఉలుకాలి శిఖరం మీద ఉన్న పెద్ద థీమ్ పార్క్. గాంబ్లింగ్ అడ్డా. ఇక్కడ గాంబ్లింగ్‌కి అధికారికంగా అనుమతిస్తారు. పర్యాటకులు ఆ భారీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ను చూసి ఆనందించడానికి పరిమితం కావాలి. గెంటింగ్ హైల్యాండ్స్ సమీపంలో చిన్ స్వీ కేవ్స్ టెంపుల్ ఉంది. చైనా నిర్మాణాలను పోలి ఉంటుంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్ట్‌లు, నిర్మాణ నిపుణులు, శిల్పకారులకు సలామ్ చేయాలనిపిస్తుంది.
ఫోర్త్ డే: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింగపూర్ సిటీ టూర్. ఆర్చిడ్ గార్డెన్, మెర్‌లయన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ రైడ్. లంచ్ తర్వాత కేబుల్ కార్‌లో సెంటోసాకు చేరాలి. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం, ఐఓఎస్, వింగ్స్ ఆఫ్ టైమ్ ఫస్ట్ షో వీక్షణం. ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ తర్వాత హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి బస సింగపూర్‌లోనే.
హైబ్రీడ్ గార్డెన్
సింగపూర్ ఆర్చిడ్ గార్డెన్ మామూలు పూలతోట కాదు. ఈ గార్డెన్‌కు ప్రత్యేకమైన హోదా ఉంది. దీని పూర్తి పేరు నేషనల్ ఆర్చిడ్ గార్డెన్. దేశంలో ఎత్తైన ప్రదేశంలో విస్తరించి ఉంది. కొండ మీద బొటానికల్ గార్డెన్‌కి గుండె వంటిది ఈ ఆర్చిడ్ గార్డెన్. బొటానికల్ గార్డెన్‌లోని కోర్ ఏరియా అని చెప్పవచ్చు. రంగుల కలలా అనిపిస్తుంది. గార్డెన్‌లో విహరించినంత సేపూ రంగుల పూలను విభ్రమగా చూస్తాం. కానీ గార్డెన్ విహారం తర్వాత ఒక చోట కూర్చుని గార్డెన్ మొత్తాన్ని లాంగ్ షాట్‌లో చూస్తూ సింహావలోకనం చేసుకుంటే ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఆలోచించగా ఆలోచించగా ఈ పూలకు వాసనలు లేవనే వాస్తవం స్ఫూరిస్తుంది. పూలన్నీ హైబ్రీడ్ వంగడాలే. కనువిందు చేయడంలో ఏ కొరతా ఉండదు.
సింహంచేప
ఈ పదం ఎంత విచిత్రంగా ధ్వనిస్తుందో ఈ శిల్పం కూడా అలాగే ఉంటుంది. దిగువ భాగం చేప ఆకారం, పై భాగం సింహం ఆకారంతో మిళితమై ఉంటుంది. ఇది మెర్‌లయన్ పార్కులో ఉంది, ఈ శిల్పం సింగపూర్ పర్యాటక చిహ్నం. ఇక సింగపూర్ ఫ్లయర్ రైడ్ లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పవచ్చు. ఇది కేవలం ఐవు వందల అడుగుల ఎత్తులో తిరిగే జెయింట్‌వీల్ మాత్రమే కాదు, ఏసీ జెయింట్ వీల్. ఇక్కడ పర్యటిస్తుంటే ఈ దేశ పర్యాటకరంగం దేశంలో ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టకుండా అభివృద్ధి చేసిందనపిస్తుంది.
చదవండి: మహిళా క్రికెటర్లకు నీతా అంబానీ స్పెషల్ విషెస్ : సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో
సెంటోసా టుస్సాడ్స్
సెంటోసా ఐలాండ్ అంటే సింగపూర్‌లో రిలాక్సేషన్, రిక్రియేషన్ హబ్. మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం కూడా ఈ దీవిలోనే ఉంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాలు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాయి. సింగపూర్‌లో ఉన్నది ఏడవ బ్రాంచ్. ఇంకా ఈ దీవిలో గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు, రిసార్టులు, యూనివర్సల్ స్టూడియో. థీమ్ ΄ార్కులు, మెరీనా బే సాండ్స్ విహారాలన్నీ కలిసి సింగపూర్ టూర్ అంటే నెక్ట్స్ లెవెల్ అనే ఫీలింగ్‌నిస్తాయి. కేబుల్ కార్‌లో ప్రయాణిస్తూ ఐలాండ్‌లో వీటన్నింటినీ విహంగవీక్షణం చేయవచ్చు. మలేసియాలో ఉన్నట్లు సింగపూర్‌లో కూడా ప్రదేశాల పేర్లు సంస్కృత మూలాలతో ఉన్నాయి. సెంటోసా అనే పదానికి మూలం కూడా సంస్కృతమే. సంతోష అనే పదం నుంచి వచ్చింది. ఈ దీవిలో ఇప్పటి వరకు చూసినవన్నీ ఒక ఎత్తయితే... వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరుతో జరిగే క్రాకర్స్ ఫెస్ట్ మరో ఎత్తు.
ఫిఫ్త్ డే: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత యూనివర్సల్ స్టూడియోస్‌కి ప్రయాణం. సూడియోస్ విజిట్ తర్వాత గార్డెన్స్ విహారం, సింగపూర్ బే, డోమ్స్ విజిట్. ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం తరవాత హోటల్ దగ్గర డ్రాపింగ్. రాత్రి బస సింగపూర్‌లోనే.
సంతోషాల దీవి
సెంటోసా ఐలాండ్ విహారం ఒక రోజులో పూర్తయ్యేది కాదు. యూనివర్సల్ స్టూడియోస్‌లో ఉన్న థీంపార్క్‌ల కోసం కొన్ని గంటలు కేటాయించాలి. ఇందులో 24 రకాల రైడ్‌లుంటాయి. ఓ యాభై ఏళ్లు దాటిన వాళ్లకు ఏ రైడ్ అయినా ఒకటే అన్నట్లు ఉంటుంది, కానీ ఇరవై ఏళ్ల వాళ్లకు ప్రతి రైడ్‌నీ ఎంజాయ్ చేస్తే తప్ప టూర్ ఇచ్చే సంపూర్ణమైన సంతోషాన్ని ఫీలవ్వలేదు. ఆసియా ఖండం అంతటిలో ఇలాంటి థీమ్ పార్క్ స్టూడియో మరొకటి లేదు. ఆసియా వాసుల మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ సింగపూర్‌ని మంచి టూరిస్ట్ డెస్టినేషన్‌గా చూస్తాయి. అందుకే ఏడాదికి నాలుగు కోట్ల మంది ఈ యూనివర్సల్ స్టూడియోస్‌కి వస్తారు. ఇక ఇక్కడ సముద్ర తీరాన బే గార్డెన్స్, డోమ్స్ పేరుతో చాలా ఉద్చానవనాలుంటాయి. ఉన్న కొద్దిపాటి నేలను పర్యాటకమే ప్రధానంగా అభివృద్ధి చేసుకుని చక్కటి రాబడిని చూస్తోందీ దేశం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆరో రోజు : బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బర్డ్ ప్యారడైజ్‌కి ప్రయాణం. లంచ్, షాపింగ్ తర్వాత నిర్వాహకులు పర్యాటకులను సింగపూర్ ఎయిర్΄ోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ విమానం ఎస్‌క్యూ– 522 బయలుదేరుతుంది.
పక్షుల స్వర్గం
బర్డ్స్ ప్యారడైజ్... నలభై ఎకరాల్లో విస్తరించిన పక్షిధామం ఇది. పక్షుల స్వర్గధామం అనే పేరు అక్షరాలా నిజం. ప్రపంచంలోని అన్ని రకాల వాతావరణాల్లో జీవించే పక్షిజాతులన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఆ పక్షుల కోసం వాటికి అనువైన వాతావరణంతో గూళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ పర్యటించేటప్పుడు చేయాల్సింది నేలను, నింగినీ చూసుకుంటూ నడవడం కాదు, చెట్ల కొమ్మల మీద కూర్చుని కువకువలాడుతున్న పక్షుల కోసం తలెత్తి కళ్లు విప్పార్చుకుని చూస్తూ సాగి΄ోవాలి. ఒక పక్షి ఉన్నట్లు మరో పక్షి ఉండదు. వాటి రెక్కలకు ప్రకృతి అద్దిన రంగులు గాఢంగా ఆకర్షణీయంగా ఉంటాయి.
ఇండియా టూ సింగపూర్ వయా మలేసియాసింగపూర్, మలేసియాలను కవర్ చేసే ఈ ఆరు రోజుల టూర్ పేరు ‘మ్యాజికల్ మలేసియా వింత్ సింగపూర్ సెన్సేషన్ ఎక్స్ హైదరాబాద్’.
టూర్ కోడ్ : ఎస్‌హెచ్‌ఓ1.
ప్రయాణం ఎప్పుడు? డిసెంబర్ 11వ తేదీ మొదలవుతుంది.
ఎస్‌క్యూ – 523/104 విమానం రాత్రి 23.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది.
తిరుగు ప్రయాణం 17వ తేదీన. ఎస్‌క్యూ–522 విమానం సింగపూర్‌లో రాత్రి 20.00 గంటలకు బయలుదేరి 21.55 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.
టారిఫ్ ఇలాగ!సింగిల్ షేరింగ్‌లో ఒకరికి 1,56,900 రూపాయలు,
డబుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 1,29,250
ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 1,29,000 రూపాయలు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


