గ్యాస్‌కు మళ్లీ ఆధార్ | again start integration of aadhar card with gas | Sakshi
Sakshi News home page

గ్యాస్‌కు మళ్లీ ఆధార్

Nov 9 2014 2:03 AM | Updated on Sep 2 2017 4:06 PM

గ్యాస్‌కు మళ్లీ ఆధార్

గ్యాస్‌కు మళ్లీ ఆధార్

గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం మళ్లీ మొదలు కానుంది.

ఒంగోలు: గ్యాస్‌కు ఆధార్ అనుసంధానం మళ్లీ మొదలు కానుంది. ఈనెల 15వ తేదీ నుంచి ఆధార్‌ను అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర చమురు, సహజ వాయు మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో గ్యాస్ కంపెనీలకు స్పష్టం చేసింది. దీంతో మళ్లీ ఆధార్ రగడ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 54 వేల మంది వినియోగదారులకు ఈ వ్యవహారం శరాఘాతంగా మారే అవకాశాలున్నాయి.

 జిల్లాలో ఐవోసీ పరిధిలో 3.35 లక్షల కనెక్షన్లు ఉండగా ఇప్పటి వరకు 2.91 లక్షల కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం పూర్తయింది. భారత్ గ్యాస్ పరిధిలో 1.29 లక్షల కనెక్షన్లకు గాను 1.28 లక్షల కనెక్షన్లు ఆధార్‌కు అనుసంధానం అయ్యాయి. హెచ్‌పీసీఎల్ పరిధిలో 1.14 లక్షల కనెక్షన్లకుగాను 1.03 లక్షల కనెక్షన్ల వినియోగదారులు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు.

దీంతో జిల్లా వ్యాప్తంగా 5.79 లక్షల కనెక్షన్లకుగాను 5.22 లక్షల కనెక్షన్ల వినియోగదారులు ఆధార్‌ను అనుసంధానించుకున్నట్లయింది. హెచ్‌పీసీఎల్ పరిధిలో 9 వేల మంది, ఐవోసీ పరిధిలో 44 వేల మంది ఆధార్ అనుసంధానించుకోవాల్సి ఉంది. బీపీసీఎల్ పరిధిలో దాదాపు 900 మంది మాత్రమే ఆధార్‌ను అనుసంధానం చేసుకోలేదు.
 
 గత సమస్యలకు పరిష్కారం చూపకుండానే:
 గతంలో యూపీఏ ప్రభుత్వం గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసింది. అప్పట్లో వినియోగదారులకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఆధార్ అనుసంధానం చేసుకున్నా..గ్యాస్ తీసుకున్న వారికి సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాల్లో పడలేదంటూ చాలా మంది పౌరసరఫరాల శాఖ అధికారులు, తహశీల్దార్లు, బ్యాంకర్లు, గ్యాస్ కంపెనీల చుట్టూ తిరగలేక తీవ్ర అవస్థలు పడ్డారు.

దీనిపై దేశవ్యాప్తంగా  నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియను నిలిపివేసింది. ఆధార్ ఉన్నా లేకపోయినా ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను రాయితీపై ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీ, బీజేపీలు ఆధార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించాయి.

 ప్రస్తుతం ప్రభుత్వాలు మారాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు నేడు అధికారంలోకి వచ్చాయి. జన్‌థన్ ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌కు గ్యాస్‌ను అనుసంధానించే ప్రక్రియ మళ్లీ చేపట్టింది. మంత్రిత్వ శాఖ గ్యాస్ కంపెనీలకు ఈ మేరకు ప్రకటన వెలువరించింది.

దీని ప్రకారం ఆధార్‌ను గతంలో అనుసంధానం చేసుకున్నవారు మళ్లీ ఇవ్వాల్సిన లేదు. అలా కాకుండా ఇప్పటి వరకు ఆధార్ ఇవ్వని వారు తమ గ్యాస్ ఏజెన్సీల వద్ద, బ్యాంకుల్లో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఆధార్‌ను అనుసంధానం చేసుకుంటేనే వారికి గ్యాస్‌ను పొందిన అనంతరం సబ్సిడీ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. లేకుంటే రాయితీ మొత్తం జమకాదు. 

Advertisement
 
Advertisement
Advertisement