సకాలంలో స్పందించిన యంత్రాంగం | Administration responded to in a timely manner | Sakshi
Sakshi News home page

సకాలంలో స్పందించిన యంత్రాంగం

Jun 14 2015 1:54 AM | Updated on Apr 3 2019 7:53 PM

రాజమండ్రి రూరల్ : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22 మందిని బలిగొన్న దుర్ఘటనపై అధికార యంత్రాంగం సకాలంలో స్పందించింది.

రాజమండ్రి రూరల్ : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22 మందిని బలిగొన్న దుర్ఘటనపై అధికార యంత్రాంగం సకాలంలో స్పందించింది. ప్రమాదం గురించి తెలియగానే అర్బన్ జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు. ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శివాజీరాజు, ఎస్సైలు, సిబ్బంది బ్యారే జ్ కిందకు దిగి తుఫాన్ వ్యాన్‌లో చిక్కుకున్న మృతదేహాలను స్థానిక మత్స్యకారుల సహకారంతో బయటకు తీశారు.
 
 తుఫాన్ వ్యాన్ ఏపీ 31టీసీ3178 నెంబరు ఆధారంగా విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేట ప్రాంతానికి చెందిన ఈగల అప్పారావు కుటుంబ సభ్యులుగా గుర్తించి వెంటనే విశాఖపట్నం పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయరామరాజు ఆధ్వర్యంలో రూరల్ తహాశీల్దార్ జి.భీమారావు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలను సేకరించి, విశాఖ జిల్లా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అంతేకాక ఉదయం 05.30 గంటలకు సంఘటన గురించి తెలియగానే మృతదేహాలకు సంబంధించిన బంగారు ఆభరణాల వివరాలు, ఇతరాల నమోదును పూర్తిచేసి రాజమండ్రిప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
 పోలీసు సిబ్బంది మృతదేహాలను చేతులతో ఎత్తుకుని బయటకు బ్యారేజ్ దిగువ నుంచి తీసుకువచ్చారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం సమయంలో కూడా అర్బన్ జిల్లా పోలీస్ సిబ్బంది, రాజమండ్రి డివిజన్ పరిధిలోని తహశీల్దార్‌లు, ఆర్‌ఐలు, వీఆర్‌వోలు శవ పంచనామాలు వేగంగా పూర్తిచేసి త్వరితగతిన మృతదేహాలను బంధువులకు అప్పగించగలిగారు. జరిగిన విషాదం ఎవరూ సరిచేయగలిగింది కాకపోరుునా.. అవసరమైన చర్యలను సకాలంలో, సమర్థంగా నిర్వర్తించిన పోలీసు, రెవెన్యూ శాఖలు, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సిబ్బందిని మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు.
 
 కేసు నమోదు
 ధవళేశ్వరం : బ్యారేజ్‌పై జరిగిన ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసినట్టు ధవళేశ్వరం సీఐ శివాజీరాజు తెలిపారు. ధవళేశ్వరం వీఆర్‌ఓ కర్రి భానుజ్యోతి ఫిర్యాదు మేరకు   కేసు నమోదు చేశామన్నారు. సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement