త్వరలో టెట్, డీఎస్సీ ప్రకటన

Adimulapu Suresh Comments About TET And DSC - Sakshi

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తిరువూరు: ఈ ఏడాది టెట్, డీఎస్సీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. 2018 డీఎస్సీలో న్యాయ వివాదాలతో నిలిచిపోయిన నియామకాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా తిరువూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు విచ్చేసిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. గతంలో కొన్ని డీఎస్సీల్లో నెలకొన్న సమస్యలను కూడా సత్వరం పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.

గత ప్రభుత్వాలు కొత్త జూనియర్‌ కళాశాలలు మంజూరు చేసినా అధ్యాపక పోస్టులకు అనుమతి ఇవ్వలేదన్నారు. దీంతో తాత్కాలిక ప్రాతిపదికపై నియామకాలు జరిగాయని, కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం అనుసరిస్తోందన్నారు. కళాశాలల్లో అధ్యాపక పోస్టులను ఏ మేరకు భర్తీ చేయాలో పరిశీలించి త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామన్నారు. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తొలివిడత రూ.3,600 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సంక్రాంతి తర్వాత మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ అమలవుతుందన్నారు. ఇందుకు అదనంగా రూ.300 కోట్లు ఏటా ఖర్చవుతుందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇష్టానుసారం వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. ఎమ్మెల్యే రక్షణనిధి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top