
హాజరు, సెలవుల మంజూరు అంతా ఆన్‌లైన్‌లోనే
ఇందుకోసం అందుబాటులోకి ప్రత్యేక పోర్టల్
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రతి క్లాసులో సీసీ కెమెరా
ఇంటర్ బోర్డు హెడ్ ఆఫీస్ నుంచే పర్యవేక్షణ
ప్రతి వారం యోగా, స్పోర్ట్స్, ల్యాబ్ తరగతులు
మీడియాతో ఇష్టాగోష్టిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సాంకేతిక సంస్కరణలకు ఇంటర్మీడియట్ బోర్డు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమయపాలన కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన ఇంటర్మీడియట్ బోర్డు... విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హాజరుతోపాటు సెలవులు, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల జారీ, సర్వీసు పరమైన అంశాలకు సాంకేతికతను జోడించింది.
ఇందుకోసం బోర్డు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై తరగతులకు విద్యార్థులు హాజరు కాకపోతే వెంటనే వారి తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశాన్ని తెలుగులో పంపించనుంది. బోధన, బోధనేతర సిబ్బందికి సెలవుల మంజూరును సైతం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే జారీ చేయనుంది.
సిబ్బంది సర్వీసుకు సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ, సర్వీసు పుస్తకాల నిర్వహణ, ఇతర అంశాలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దసరా సెలవులు ముగిసిన తర్వాత ఈ వెబ్‌పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
ప్రత్యేక తరగతులు
రాష్ట్రంలో 431 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. దాదాపు అన్ని కాలేజీల్లోని తరగతి గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయింది. వీటి ద్వారా కాలేజీల్లో తరగతుల నిర్వహణను బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి పరిశీలిస్తున్నారు. ఇందుకోసం బోర్డు కార్యాలయంలోని ఒకటో అంతస్తులో కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కాలేజీ స్థాయిలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ప్రిన్సిపాల్‌కు అప్పగించారు.
ప్రస్తుతం బోధన కార్యక్రమాలకు అదనంగా వారంలో మూడు రోజుల పాటు మూడు రకాల కార్యక్రమాలను ప్రవేశపెడతామని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. వారంలో ఏదైనా ఒకరోజు యోగా/మెడిటేషన్, మరో రెండ్రోజులు క్రీడలు, ల్యాబ్ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. అన్ని ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
త్వరలోనే ప్రఖ్యాత సంస్థతో అవగాహన కుదుర్చుకుని ఉచితంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. జూనియర్ కాలేజీ విద్యార్థుల డ్రెస్ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం అమలు అంశాన్ని కూడా వివరిస్తానని తెలిపారు.