సమస్యలు తీర్చేవాడే నాయకుడు..

Actor Suman Exclusive Interview  - Sakshi

ఆధ్యాత్మిక చిత్రాలతో సంతృప్తి

సినీ నటుడు సుమన్‌

విజయనగరం టౌన్‌: పేదల సమస్యలు తీర్చేవాడే నిజమైన నాయకుడు.. అటువంటి నాయకుడ్నే ప్రజలు గుర్తించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ అన్నారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న వారికి సపోర్ట్‌ చేయాలనే ఉద్దేశం ఉన్నా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటివరకు సుమారు నాలుగు వందల చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆధ్యాత్మిక చిత్రాలతో ఎనలేని సంతృప్తి లభించిందని చెప్పారు. జిల్లా కేంద్రంలో ఓ బ్యూటీపార్లర్‌ను ప్రారంభించేందుకు ఆదివారం వచ్చిన ఆయన కాసేపు సాక్షితో మాట్లాడారు.  

రాజకీయంపై అవగాహన ఉండాలి...
రాజకీయాల్లోకి  రావాలంటే పొలిటికల్‌ సబ్జెక్ట్‌పై పూర్తిగా అవగాహన ఉండాలి. లేదా అటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఎంజీఆర్, ఎన్‌టీఆర్‌లకు రాజకీయాలపై అవగాహన ఉంది. అందుకే వారు రాణించారు. రజనీ, కమల్‌ వంటి వ్యక్తులకూ కూడా రాజకీయ పరిజ్ఞానం ఉంది. ప్రస్తుత రాజకీయాలపై ప్రజలకు కూడా మంచి అవగాహన ఉంది.  

రైతే రాజు..
దేశానికి రైతే వెన్నుముక. అన్నదాతలు బాగుంటనే మనందరం బాగుంటాం. రైతులను బాగా చూసుకున్న వారే పాలకులుగా రావాలి. అలాగే విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై అవగాహన ఉన్నవారే నాయకులుగా రావాలి.

సహనంతోనే సక్సెస్‌  
 మన ఆలోచన, మాట్లాడే విధానం బట్టే  ఎదుగుదల ఉంటుంది. చేసే పనిలోనే దేవుడ్ని చూసుకోవాలి. సహనంతో పనిచేసుకుంటూ పోతే సక్సెస్‌ దానంతటే అదే వస్తుంది. సినిమా రంగంలో కొందరు త్వరగా సక్సెస్‌ అవుతారు... కొంతమంది ఆలస్యంగా అవుతారు.. అంతవరకు ఓపిక పట్టాలి.

నలుగురి చేతిలో..
సినిమా ఇండస్ట్రీ నలుగురి చేతిలో ఉన్నమాట వాస్తవమే. పెద్ద సినిమాల గ్యాప్‌లో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఇంతవరకు తెలుగు, తమిళ్, కన్నడ, తదితర భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం ఆరు తెలుగు, రెండు కన్నడ చిత్రాల్లో నటిస్తున్నాను.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top