హమ్మయ్య.. ‘వరు’ణించాడు | acid rainfall in ponduru | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. ‘వరు’ణించాడు

Jul 12 2014 2:08 AM | Updated on Aug 17 2018 2:10 PM

హమ్మయ్య.. ‘వరు’ణించాడు - Sakshi

హమ్మయ్య.. ‘వరు’ణించాడు

చినుకు చుక్క కోసం ఇన్నాళ్లూ తపించిన పుడమికి నీటి తడి అందింది. ఆలస్యంగానైనా అదనులో వర్షం కురిసినందుకు రైతులోకం మురిసిపోతోంది.

 శ్రీకాకుళం అగ్రికల్చర్: చినుకు చుక్క కోసం ఇన్నాళ్లూ తపించిన పుడమికి నీటి తడి అందింది. ఆలస్యంగానైనా అదనులో వర్షం కురిసినందుకు రైతులోకం మురిసిపోతోంది. నెర్రెలువారిన నేలలు వాన నీటిని ఆబగా తమలోకి ఇముడ్చుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు మండలాల్లో విస్తారంగా, మరికొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

జిల్లా వ్యాప్తంగా 30.1 సగటుతో మొత్తం 1145.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అత్యధికంగా ఇచ్ఛాపురంలో 85.6 మి.మీ, కవిటిలో 75.2, పోలాకిలో 61.8, అత్యల్పంగా వంగరలో 3.4 మి.మీ.వర్షపాతం నమోదైంది. అన్ని మండలాల్లోనూ వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఖరీఫ్ పంటలకు అనుకూలమైన సమయంలో కురిసిన ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, గోగు, సజ్జ తదితర పంటలకు ఉపయోగకరమని అంటున్నారు. వర్షాలు లేక ఇన్ని రోజులూ వరి నారుమళ్లను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. ఆయిల్ ఇంజిన్ల సహాయంతో దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వచ్చింది. మరో రెండు రోజులు వర్షాలు లేకపోతే వరి నారుమళ్లు పూర్తిగా దెబ్బతినేవని, ప్రస్తుత వర్షాలు వాటికి జీవం పోశాయని రైతులు చెబుతున్నారు.

ఈ సీజనులో నిన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే విత్తుకున్న మొక్కజొన్న తదితర పంటలు చాలా వరకు పాడయ్యాయి. వీటితో పాటు నీరు అందుబాటులో లేని చాలా చోట్ల వరి నారుమళ్లు కూడా పాడయ్యాయి. ప్రస్తుత వర్షాలతో మెట్టు రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సుమారు ఆరు నెలలుగా వర్షాలు లేక భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక నానా అవస్థలు పడిన ప్రజలు కూడా ఈ వర్షాలతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో వాతావరణం చల్లబడింది. మరో రెండు వర్షాలు కొనసాగితే వ్యవసాయంతోపాటు సాధారణ జన జీవనానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది.  
 
పొందూరులో ఆమ్ల వర్షం
పొందూరు : జిల్లా అంతటా మామూలు వర్షాలు పడితే.. పొందూరులో మాత్రం ఆమ్ల వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో కొద్దిసేపు కురిసిన ఈ వర్షంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద, మార్కెట్ ప్రాంతంలోనూ ఆమ్ల వర్షం కురిసిందని స్థానికులు చెప్పారు. పసుపు వర్ణంలో నీటి చుక్కలు శరీర భాగాలపై పడినప్పుడు కొద్దిగా మంట పుట్టిందని వారన్నారు. వాతావరణ  కాలుష్యం కారణంగా పొందూరులో ఆమ్ల వర్షం కురవడం ఇది రెండోసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement