ఏసీబీ వలలో గులివిందాడ వీఆర్‌వో | ACB trap VRO gulivindada | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో గులివిందాడ వీఆర్‌వో

Jun 25 2015 5:27 AM | Updated on Aug 17 2018 12:56 PM

కొత్తవలస: పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వటానికి ఓ వ్యక్తి నుంచి రూ.5 వేలు తీసుకుంటూ మండలంలోని గులివిందాడ వీఆర్‌వో డీసీహెచ్.అప్పలనాయుడు ఏసీబీ అధికారులకు బుధవారం సాయంత్రం పట్టుబడ్డారు.

కొత్తవలస: పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వటానికి ఓ వ్యక్తి నుంచి రూ.5 వేలు తీసుకుంటూ మండలంలోని గులివిందాడ వీఆర్‌వో డీసీహెచ్.అప్పలనాయుడు ఏసీబీ అధికారులకు బుధవారం సాయంత్రం పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి చెప్పిన వివరాల ప్రకారం.. గులివిందాడ గ్రామానికి చెందిన విరోతి రఘు వారసత్వంగా తమకు వచ్చిన ఎకరా 50 సెంట్ల భూమికి తన తండ్రి పేరున పట్టాదార్ పాసుపుస్తకాలు ఇవ్వాలని ఆన్‌లైన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నారు.
 
  ఇంతవరకు పాస్‌పుస్తకం ఎందుకు రాలేదని వీఆర్‌వో అప్పలనాయుడును అడిగారు. ఎంతో కొంత ఇస్తేగాని పాస్ పుస్తకం ఇచ్చేదిలేదని అప్పలనాయుడు చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు రూ. ఏడు వేలు ఇస్తామని అప్పలనాయుడుకు చెప్పారు. ఈ మేరకు బుధవారం కొత్తవలస కుమ్మరవీధిలోని వీఆర్‌వో ప్రైవేటు కార్యాలయంలో రఘు రూ.5 వేలను అప్పలనాయుడుకు ఇచ్చారు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడిలో ఏసీబీ సీఐలు డి.రమేష్, ఎస్.లకో్ష్మజి, పాల్గొన్నారు.
 
 లంచం ఇవ్వలేకే..
 పట్టాదార్ పాసు పుస్తకం కోసం లంచం ఇవ్వలేకే ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు రఘు విలేకరులకు తెలిపారు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవటంతో ఎంతకావాలని వీఆర్వోను అడిగితే రూ. ఏడు వేలు ఇస్తే పనవుతుందని చెప్పారన్నారు. అంత డబ్బు ఇవ్వలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
 
 హెచ్‌డీటీపై ఏసీబీ అధికారుల ఆగ్రహం
 పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవటంతో హెచ్‌డీటీ గౌరీశంకరరావుపై ఏసీబీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చేసరికి డిప్యూటీ తహశీల్దార్ ఆనందరావు లేరు. దీంతో హెచ్‌డీటీని సమాచారం అడగ్గా లేదని ఆయన చెప్పడంతో మండిపడ్డారు. ఈలోగా అక్కడికి వచ్చిన డీటీ ఆనందరావు మాట్లాడుతూ రఘు అడిగిన పట్టాదార్ పాస్ పుస్తకాన్ని ఇప్పటికే మంజూరు చేశామని చెప్పారు. దానిని వీఆర్‌వో ఎందుకు ఇవ్వలేదో తనకు తెలియదన్నారు.
 
 అవినీతి అధికారుల భరతం పడతాం..
 అవినీతి అధికారుల భరతం పట్టడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి చెప్పారు. దాడి అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో మరింత చైతన్యం రావల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీలో వీఆర్‌వోలు అవినీతికి పాల్పడుతున్నట్టు ఎక్కవగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. ప్రజలు కూడా ఎక్కువగా చిరుద్యోగులపైనే ఫిర్యాదు చేస్తున్నారని ఆయన వివరించారు. ఉన్నతాధికారుల అవినీతిని బట్టబయలు చేయటానికి కూడా వారు ముందుకు రావాలని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement