మాజీ సైనికోద్యోగి నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఒకరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
గరివిడి (విజయనగరం) : మాజీ సైనికోద్యోగి నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఒకరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గరివిడిలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఏనుగువలస గ్రామానికి చెందిన వర్మ అనే మాజీ సైనికోద్యోగి తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయటానికి వీఆర్వో వెంకటస్వామి చుట్టూ గత కొద్దిరోజులుగా తిరుగుతున్నారు.
వీఆర్వో మాత్రం రూ.5 వేలు ఇస్తేనే పని పూర్తి చేస్తానని పట్టుబట్టాడు. దీంతో వర్మ ఏసీబీ అధికారులకు ఉప్పందించారు. వారి సూచనల మేరకు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోకు లంచం డబ్బు అందజేస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.