రామడుగు మండలం రాంచంద్రాపూర్‌కు చెందిన కడారి శంకర్ అనే రైతు ఈ నెల 5న పహణీ నకల్ కోసం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
ఎక్కడెక్కడో ఏసీబీ దాడులు చేసుకుంటే వీరు తమకేం అనుకుంటున్నారు. అవినీతి అధికారుల భరతం పడతామని హెచ్చరిస్తున్నా... ఏసీబీ నిత్యం దాడులు నిర్వహించి జైలుకు పంపిస్తున్నా... వీరు మాత్రం మారడం లేదు. లంచాలు తినమరిగి.. సామాన్యులను పీడిస్తూనే ఉన్నారు. శనివారం ఏసీబీ దాడుల్లో మరో ‘రెవెన్యూ’ చేప చిక్కింది. పహణీ నకల్ కోసం ఓ రైతు నుంచి తహశీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
రామడుగు, న్యూస్‌లైన్ : రామడుగు మండలం రాంచంద్రాపూర్‌కు చెందిన కడారి శంకర్ అనే రైతు ఈ నెల 5న పహణీ నకల్ కోసం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ మూల చంద్రశేఖర్‌రెడ్డిని కలవగా డబ్బులు ఇస్తే పహణీ నకల్ ఇస్తానని చెప్పాడు. దీంతో అప్పుడే రూ.వెయ్యి అందించాడు. అయినా పహణీ ఇవ్వకపోవడంతో ఈ నెల 20న మళ్లీ వెళ్లి అడగగా మరో రెండు వేలు ఇస్తేనే పహణీ ఇస్తానని చెప్పాడు.
తాను అంత ఇచ్చుకోలేనని, పహణీ ఇవ్వాలని కోరినా స్పందించకపోవడంతో విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లాడు. జూనియర్ అసిస్టెంట్ వద్దే పనిచేసుకోవాలని ఆయన సెలవివ్వడంతో చేసేదేమీ లేక మళ్లీ చంద్రశేఖర్‌రెడ్డి వద్దకే వచ్చాడు. పైసలు ఇవ్వనిదే పహణీ ఇవ్వనని ఆయన తెగేసి చెప్పడంతో విసిగిపోయిన శంకర్ కరీంనగర్‌లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ప్రణాళిక ప్రకారం శంకర్‌కు శనివారం రూ.2 వేలు ఇచ్చి పంపించారు. అతడు కార్యాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్‌కు ఆ డబ్బులు ఇవ్వగా అక్కడే ఉన్న డీఎస్పీతోపాటు ఇన్‌స్పెక్టర్లు రమణమూర్తి, శ్రీనివాసరాజు, సిబ్బంది కలిసి చంద్రశేఖర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే 9440446150 నంబర్‌కు ఫోన్ చేయాలని డీఎస్పీ తెలిపారు.