మహా ప్రాణదీపం

Aarogyasri Scheme Support To Jasmita - Sakshi

జస్మితకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం 

పరిధిలో లేకున్నా ప్రత్యేక కేసుగా పరిగణింపు 

జగన్‌కు జేజేలు పలుకుతున్న కుటుంబం  

కోరకుండానే దేవుడు వరమిచ్చినంత ఆనందంగా ఉంది ఆ కుటుంబం.. అనారోగ్యవంతుల పాలిట ఆపద్బాంధవిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం తమ కుమార్తెకు వర్తించదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. తమను ఆదుకునే దిక్కెవ్వరని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలిక సహ విద్యార్థులు, కళాశాల యాజమాన్యం చందాలు వేసుకొని కొంత సాయం చేశా రు. చికిత్సకు లక్షల్లో అవసరం కావడంతో.. చేయూతనందించే ఆదరవు కోసం ఎదురుచూస్తున్న దశలో ఓ సంతోషకర వార్త.. బాలిక అనారోగ్యం గురించి ‘సాక్షి’ పత్రిక ద్వారా తెలుసుకున్న ఆరోగ్యశ్రీ అధికారులు ప్రత్యేక కేసుగా పరిగణించి అవసరమైనంత సాయం చేస్తామని ముందుకు వచ్చారు.  

శ్రీకాకుళం: మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న డిగ్రీ విద్యార్థిని జస్మితను ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంటోంది. నగరంలోని ఆ నిరుపేద కుటుంబానికి చెందిన ఈ బాలిక కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. చికిత్స పొందుతున్నా ఎప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో స్థానిక వైద్యులు విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు జస్మితకు శస్త్ర చికిత్స అవసరమని తేల్చారు. నిరుపేద కుటుంబమైన వీరికి శస్త్ర చికిత్స జరిపించేందుకు అవసరమైన రూ.6 లక్షలు భరించలేమని మానసికంగా కుంగిపోయారు. జస్మిత చదువుతున్న కళాశాల విద్యార్థులు, యాజమాన్యం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ విషయం సాక్షిలో ప్రచురితం కావడంతో స్థానిక ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు.

పేదలు ఎటువంటి వ్యాధి తో బాధపడుతున్నా స్పందించి రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని అప్పటికే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించడంతో దీనిని అధికారులు ఆచరణలో పెట్టారు. జస్మితకు ఉన్న వ్యాధి ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని, నిరుపేద కుటుంబమని చెప్పడంతో రాష్ట్ర అధికారులు తక్షణం స్పందించి ప్రత్యేక కేసుగా పరిగణించి చికిత్సలు చేయించాలని జిల్లా ఆరోగ్యశ్రీ అధికారులను ఆదేశించారు. ఈ విషయం సోమవారం జస్మిత కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా ఆనందపడుతూ విశాఖపట్నం వెళ్లారు. అయితే అక్కడ బుధవారం రావాలని చెప్పడంతో తిరిగి నగరానికి చేరుకున్నారు. రానున్న శుక్ర, శని వారాల్లో గాని, సోమవారం గాని జస్మితకు శస్త్ర చికిత్స జరిగే అవకాశాలున్నాయి.

వైఎస్సార్‌ కుటుంబానికి రుణపడి ఉంటాం.. 
బిడ్డను ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుందని జస్మిత తండ్రి రాము ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. తాపీమేస్త్రి గా పనిచేస్తున్న తనకు అంత పెద్ద మొత్తం వెచ్చించే స్థోమత లేదని, తమ కూతురు పడుతున్న బాధ చూడలేక రోజూ తన భా ర్య, తాను కుంగిపోయేవారమన్నారు. బాగా చదివే జస్మిత తమను ఆదుకుంటుందని భావించి ఎన్ని కష్టాలు ఎదురైనా చదివించామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో జస్మితకు ఉన్న వ్యాధి రాదని తొలుత వైద్యులు చెప్పడంతో ఆశలు వదులుకున్నామని, ప్రత్యేక కేసుగా పరిగణించి చికిత్స చేయిస్తామని ఆ రోగ్యశ్రీ అధికారులు చెప్పగానే ఆనందం ప ట్టలేకపోయామన్నారు.  వైఎస్‌ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.        

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top