పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ | Aarogyasri Expanded To Hospitals In Bengaluru And Chennai And Hyderabad | Sakshi
Sakshi News home page

నేటి నుంచే.. పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ

Nov 1 2019 4:11 AM | Updated on Nov 1 2019 8:41 AM

Aarogyasri Expanded To Hospitals In Bengaluru And Chennai And Hyderabad  - Sakshi

సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో రాష్ట్రానికే పరిమితం చేసిన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి(నవంబర్‌ 1 నుంచి) మరో మూడు రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పేదలు శుక్రవారం ఉదయం నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లోనూ నిర్ణయించిన ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే అవకాశం కలుగుతోంది. సుమారు 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు ఈ మూడు నగరాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై గత నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు సొంత రాష్ట్రంలో సరైన వైద్య సేవలు లభించక, ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే వెసులుబాటు లేక రాష్ట్రంలోని వేలాదిమంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే.. తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. తాజా జీవోను అనుసరించి.. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన వారెవరైనా రాష్ట్రంలో గానీ లేదా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో గానీ వైద్యసేవలు పొందవచ్చు.

ఇతర రాష్ట్రాల్లో వైద్యసేవలు అందించే విషయంపై ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని, అనుమతుల్లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పకడ్బందీగా అమలు చేస్తామని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో డా.ఎ.మల్లికార్జున ‘సాక్షి’తో అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వైద్యసేవలు పొందేవారి సంఖ్య ఇప్పుడే అంచనా వేయలేమని, ఎక్కువ మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ జాబితాలో 1,200 జబ్బులకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement