తెలుగు విద్యార్థులకు అన్యాయం..

54 Telugu Students Selected for National Fellowship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ ఫెలోషిప్‌ ఎంపికలో తెలంగాణ, ఏపీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగు పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశోధన విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఇచ్చే నేషనల్‌ ఫెలోషిప్‌లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోకుండానే ఎంపిక చేసిందని ఆరోపిస్తున్నారు. 2018–19 సంవత్సరానికి సంబంధించి నేషనల్‌ ఫెలోషిప్‌నకు ఎంపికైన ఓబీసీ విద్యార్థుల జాబితాను యూజీసీ బుధవారం ప్రకటించింది. మొత్తం 1,000 మందిని ఎంపిక చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 54 మంది తెలుగు వారే ఎంపికయ్యారు. మరో 13 మంది హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులను కలుపుకొంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 67 మంది మాత్రమే ఎంపికయ్యారు. పరిశోధనలో మేటిగా ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎంపికయ్యారని పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో లోపం ఉందని ఆరోపిస్తున్నారు. యూజీసీ ఎంపిక కమిటీ కావాలనే తెలుగు విద్యార్థులపై వివక్ష చూపిందని పేర్కొంటున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
నేషనల్‌ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసే విద్యార్థి ఎంఫిల్‌/పీహెచ్‌డీలో రిజిస్టర్‌ అయి ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షలలోపు ఉన్న వారే ఈ ఫెలోషిప్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని యూజీసీ ప్రకటించింది. ఈ అర్హతలతో పాటు విద్యార్థులకు పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా (మెరిట్‌) ఎంపిక చేస్తామని యూజీసీ ప్రకటించింది. అన్ని అర్హతలు కలిగి ఎంపికైన వారికి మొదటి రెండేళ్లు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కింద నెలకు రూ.25 వేల చొప్పున, తర్వాత సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కింద నెలకు రూ.28 వేల చొప్పున యూజీసీ ఇస్తుంది. కంటింజెన్సీ కింద మొదటి రెండేళ్లు ఏటా కనీసంగా రూ.10 వేలు, రెండేళ్ల తర్వాత ఏటా కనీసంగా రూ.20 వేలు ఇస్తుంది.

ఈ నిబంధల ప్రకారం అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఐదారు వందల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర పరిశోధన విద్యార్థులు చెబుతున్నారు. అందులో 54 మందినే ఎంపిక చేయడం దారుణమని వాపోతున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.

తెలుగు విద్యార్థుల పట్ల వివక్షే
ఇది ముమ్మాటికి తెలుగు విద్యార్థుల పట్ల వివక్షే. ఏ ప్లస్‌ గ్రేడ్‌ అక్రెడిటేషన్‌ కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 7 మందినే ఎంపిక చేయడం సరికాదు. ఇక్కడ నెట్‌/సెట్‌ కలిగిన వారు వేలల్లో ఉన్నారు. పీహెచ్‌డీలు చేస్తున్న వారు ఉన్నారు. నాణ్యమైన పరిశోధన ఇక్కడే జరుగుతోంది. యూజీసీలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల అన్యాయం చేశారు. కావాలనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించి తెలుగు విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి.
– విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్‌ చైర్మన్‌ చెనగాని దయాకర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top