24 గంటల సేవలు వట్టిమాటే

24 గంటల సేవలు వట్టిమాటే - Sakshi


నెల్లూరు(అర్బన్) : జిల్లాలో 30 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 22 లక్షల వరకు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు 27 ఉన్నాయి. ఇవి కాక పట్టణ ప్రాంతాలైన కావలి, గూడూరు, ఆత్మకూరులో ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్రంలో డీఎస్సార్ జనరల్ ఆసుపత్రి(పెద్దాసుపత్రి) 24 గంటల పాటు వైద్య సేవలందిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రిలో సేవలు దారుణం

 నెల్లూరులోని జిల్లా ఆసుపత్రిని పరిశీలిస్తే సేవలు దారుణంగా ఉన్నాయి. రాత్రి పూట డ్యూటీలు మారేటప్పుడు డ్రెస్సింగ్ చేంజ్ పేరుతో 8 నుంచి 9 గంటల వరకు వార్డుల్లో ఒక్క నర్సు కూడా కనిపించడం లేదు. ఖాళీ కుర్చీలే కనిపించాయి. అదే సమయంలో ఆరోగ్యం సరిగా లేని ఓ మహిళ ఎమెర్జెన్సీ విభాగానికి చేరుకుంది. డాక్టరమ్మ పక్కరూంలోనే ఉంది. అయితే కాంపౌండర్ వైద్యం చేశారు. బైక్ బోల్తా పడి ఆసుపత్రికి చేరిన ఇద్దరికి కూడా కాంపౌండరే వైద్యం చేశారు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు వారం రోజులుగా మూతపడింది.పలు వార్డుల్లో లైట్లు వెలగడం లేదు. బ్లడ్‌బ్యాంకు వద్ద మెట్లు ఎక్కే దక్కర చీకటిగా ఉంది. బ్లడ్ బ్యాంకు వద్ద ఒకే నర్సు ఉంటారు. వారికి రక్షణ కరువైంది. ప్రసూతి కేంద్రంలో, జనరల్ ఆసుపత్రి ఎమెర్జెన్సీ విభాగంలో రోగిని కుర్చీలో పట్టేదానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బంధువులే వీల్ చైర్‌ను నెట్టుకుంటూ పోతున్నారు. గ్రామీణంలో వైద్యులేరీ?

 గ్రామీణ ప్రాంతంలో 24 గంటలు వైద్య సేవలు అందించే ఆసుపత్రులు 27 ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే కోవూరు ఆసుపత్రిలో నర్సులే వైద్యం చేస్తున్నారు. అత్యవసరమైతే డాక్టర్ ఇంటికి పోయి పిలుచుకుని వస్తారంట. విడవలూరు మండలం రామతీర్థం పీహెచ్‌సీలో డాక్టర్లు, సిబ్బంది లేరు. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. బుచ్చిరెడ్డిపాళెం ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని మూసేశారు. గూడూరు మండలం చెన్నూరులో రికార్డుల పరంగా 24 గంటల ఆసుపత్రి అయినా దానిని తెరవలేదు.చిల్లకూరు మండలం, సూళ్లూరుపేటలో డాక్టర్లు లేరు. స్టాఫ్ నర్సులే ఉన్నారు. నాయుడుపేటలోని ఆసుపత్రికి మేనకూరు పంచాయతీ ద్వారకాపూడి నుంచి వస్తున్న చెంచమ్మకు మార్గమధ్యంలోనే కానుపు అయింది. ఆమె తన బిడ్డతో పాటు ఆసుపత్రికి వస్తే చిన్నపిల్లల డాక్టర్ లేరని బిడ్డను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆత్మకూరు, కావలి, కొండాపురం, వింజమూరు, ఉదయగిరి తదితర  ప్రాంతాల్లో డాక్టర్లు అందుబాటులో లేరు. ఇళ్ల వద్దనే ఉంటున్నారు. అవసరమైతేనే వస్తున్నారు.

 

 వెంటాడుతున్న సిబ్బంది కొరత

 జిల్లాలో 24 గంటల ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులు 56 మందికి 49 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏఎన్‌ఎంలు 477 మంది ఉండాల్సి ఉండగా 389 మంది పనిచేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కళాశాలతో కలుపుకుని 238 మంది డాక్టర్లకు గాను 175 మంది పనిచేస్తున్నారు. 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయూష్ (ఆయుర్వేదం, హోమియో, యునాని) వైద్యులు 40 మంది ఉండాల్సి ఉండగా ఏడుగురు ఉన్నారు.

 

 రక్తం కోసం అల్లాడా :


 మాఅమ్మకు గర్భసంచిలో గడ్డ ఉంది. ఆపరేషన్‌కు ముందు రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెప్పారు. పెద్దాసుపత్రిలో ఒక ప్యాకెట్ రక్తం ఇచ్చారు. అంతలోనే ఫ్రిజ్ చెడిపోయింది. దీంతో రక్తం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాను. రెడ్ క్రాస్ వారు మూడు రోజులు తిప్పుకున్నారు. ఏడ్చి , ఏడ్చి యాగీ చేస్తే చివరకు రక్తం ఇచ్చారు.

 - పెంచలమ్మ, రాపూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top