కొత్తగా ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా | 15 New Coronavirus Cases File in Visakhapatnam | Sakshi
Sakshi News home page

మరో 4కేసులు

Apr 4 2020 1:05 PM | Updated on Apr 4 2020 1:05 PM

15 New Coronavirus Cases File in Visakhapatnam - Sakshi

కరోనా పాజిటివ్‌ నిర్థారన అయిన ఇంట్లో మహిళచేతులు శుభ్రం చేయిస్తున్న వైద్య సిబ్బంది

విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు.. వారితో సన్నిహితంగా మెలిగిన వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. తాజాగా నగరంలో మరో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు ఒకే ఇంటికి చెందినవి. గత నెలలో ముంబై వెళ్లి వచ్చిన ఈ కుటుంబ సభ్యుడొకరితోపాటు ఆ ఇంటిలోని మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 11 నుంచి 15కు పెరిగింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసులు నమోదైన కంచరపాలెం, అక్కయ్యపాలెం, ఐటీఐ జంక్షన్, అల్లిపురం ప్రాంతాలను దిగ్బంధించి ముమ్మర ఆరోగ్య, పారిశుధ్య చర్యలు చేపడుతున్న అధికారులు.. తాజా కేసులు నమోదైన గవర తాటిచెట్లపాలెం(రైల్వే న్యూకాలనీ) ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీటితోపాటు నగరవ్యాప్తంగా ఆరోగ్య చర్యలు విస్తృతం చేశారు.

విశాఖపట్నం: జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా శుక్రవారం మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రైల్వే న్యూకాలనీ ప్రాంతంలోని గవర తాటిచెట్లపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 15కు పెరిగింది. ముంబైలోని ఒక ప్రముఖ బంగారం షాపులో పని చేస్తున్న రాజమండ్రికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి గత నెల 24న విశాఖ నగరంలో గవర తాటిచెట్లపాలెం ప్రాంతంలో ఉంటున్న అత్తగారింటికి తన భార్య, 15 నెలల పాపను చూడడానికి విమానంలో వచ్చాడు. అప్పటి నుంచి ఆయన ఆ కుటుంబంతోనే ఉన్నారు. ఆయనతో పాటు 50 ఏళ్ల అత్త, 17 ఏళ్ల  బావమరిదిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారంతా  ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వారిని క్వారంటైన్‌లో ఉంచి.. సేకరించిన నమూనాలను పరీక్షలకు పంపించారు. శుక్రవారం అందిన రిపోర్టులు ఆ ముగ్గురిలోనూ కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేల్చాయి. రిపోర్టుల ఆధారంగా ముగ్గురినీ ఐసోలేషన్‌ వార్డుకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గిరికి కరోనా సోకడంతో ముంబై నుంచి వచ్చిన వ్యక్తి భార్య, 15 నెలల పాపకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వారు జిల్లాలో ఎవరెవరిని కలిశారన్న విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు.

అప్రమత్తమైన యంత్రాంగం
గవర తాటిచెట్లపాలెంలో కరోనా కేసులు నమోదవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితుల నివాస ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిని పోలీసులు దిగ్బంధించారు. వైద్యాధికారులు ఇంటింటికి వెళ్లి స్థానికుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement